మెగా పవర్ స్టార్ రాం చరణ్ బ్రూస్ లీ తర్వాత చేయబోతున్న తని ఒరువన్ రీమేక్ కు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సినిమా ఇప్పుడు మొదలవుతుంది, అప్పుడు మొదలవుతుంది అని హడావిడి చేసి మెగా అభిమానుల సహనాన్ని పరిక్షించిన చిత్రయూనిట్ తాజాగా ఆ సినిమాను మొదలు చేసె ఫైనల్ డేట్ ను ప్రకటించేశారు. అసలైతే ఈ నెల మొదలవుతుందన్న షూటింగ్ కాస్త వచ్చే నెల 16న అంటే ఫిబ్రవరి 16న షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో పూర్తిచేసుకున్నా కొన్ని కారణాల వల్ల సినిమా ఇంకా మొదలు కాలేదు. ఇక సినిమాలో హీరోయిన్ గా కూడా కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన ఏది వెలువడలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తెలుగులో రక్షక్ అనె టైటిల్ అనుకున్నట్టు సమాచారం.
జయం రవి, నయనతార జంటగా నటించిన తని ఒరువన్ సినిమా లాస్ట్ ఇయర్ తమిళంలో విడుదలయ్యి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. బ్రూస్ లీ నిర్మాత డివివి దానయ్య ముందు ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నా బ్రూస్ లీ అపజయపాలవ్వడంతో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేయడం జరిగింది.