టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన విమర్శలు చేశారు. తనని తాను ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు, వైకాపా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారంటూ విమర్శించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా టీడీపీని నడుపుతున్నారని మండిపడ్డారు. దేశంలో అప్రజాస్వామికవాది ఎవరైనా ఉన్నారంటే.. చంద్రబాబు నాయుడే అన్నారు! తెలుగుదేశాన్ని దొంగల పార్టీగా ఆయనే మార్చేశారన్నారు. పార్టీలో ఎక్కడ చూసినా అవినీతే అన్నారు! తెలుగుదేశం పార్టీ తమది అని చెప్పుకునే నైతిక అర్హత సీఎంకి లేదని మోత్కుపల్లి విమర్శించారు.
‘రోజూ అవినీతే, కోట్ల రూపాయాలు నువ్వూ నీ కొడుకూ సంపాదిస్తున్న పరిస్థితి ఉంది’ అన్నారు. తనకు పదవి దక్కలేదన్న అసంతృప్తితో బయటకి వెళ్లానని అంటున్నారనీ, తాను పదవే అడగలేదని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీని తరిమి కొడుతున్న పరిస్థితి ఉంటే, నర్సింహులూ నవ్వు తప్ప వేరే దిక్కులేదని వేడుకున్నది చంద్రబాబు అని చెప్పారు. ‘నా వెనకాల ఎవడో ఉన్నాడని అంటున్నారు. నా వెనక ఎవ్వరూ లేరు మిస్టర్ చంద్రబాబు! నేనే వాళ్ల వెనక ఉన్నా. నేనే జగన్ వెనక ఉంటున్నా, నేనే పవన్ వెనక ఉంటున్నా, నేనే సీపీఐ, సీపీఎం వెనక ఉంటున్నా. అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని విజ్ఙప్తి చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు మోత్కుపల్లి. ఇదీ ఆయన వరస..!
ఇప్పుడూ… పదవి దక్కలేదన్న కోపమో, పార్టీలో గుర్తింపులేదన్న ఆగ్రహంతో కదా మోత్కుపల్లి పార్టీకి దూరమైంది..? చంద్రబాబును విమర్శిస్తే.. ఆ కోణంలోనే కదా విమర్శించాలి..? ఆంధ్రాలో అవినీతి, ముఖ్యమంత్రీ ఆయన తనయుడు కోట్ల సంపాదన అనే వ్యాఖ్యలు చేయడం వెనక మోత్కుపల్లికి ఏం ఉపయోగం..? ఇది ఎవరి స్క్రిప్టు..? సరే.. తన వెనక ఎవరూ లేరనీ, అందరి వెనకే తానూ ఉన్నానని గొప్పగా చెప్పారు కదా! టీడీపీ నుంచి బహిష్కరణకు గురి కాగానే… మోత్కుపల్లి ఇంటికి వెళ్లిందెవరు.. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కదా! మోత్కుపల్లి తిరుపతి వస్తే, చంద్రబాబుపై విమర్శలు చేయించేందుకు ఏర్పాట్లు చేసిందెవరు..? టీడీపీపై విమర్శించేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నా… వారిని ప్రోత్సహించే ఓ కార్యక్రమాన్ని వైకాపా పెట్టుకుందనేది అర్థమౌతూనే ఉంది!
ఎందుకలా అంటే… వైకాపా నేతలు సీఎంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా వాటిలో పస లేదన్న భావన ప్రజల్లో నెమ్మదిగా పెరుగుతోంది. అదే, వైకాపాతో సంబంధం లేని వారు, ఆంధ్రా రాజకీయాలతో అవసరం లేనివారు ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే… ప్రజల్లో కొత్త అటెన్షన్ వస్తుందని వారు ఆశిస్తుండొచ్చు! ఆంధ్రా రాజకీయాలతో ఏ రకంగా సంబంధం లేనివారు కూడా విమర్శలు చేస్తున్నారంటే.. చంద్రబాబు నిజంగానే ఏదో చేశారేమో, అవినీతి జరిగిందేమో అనే భావన ప్రజల్లో కల్పించాలన్న వ్యూహంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలుగా ఇవి కనిపిస్తున్నాయి.