బీహార్ లో జె.డి.యు.తో భాజపా బంధం దాదాపు తెగిపోయే వరకూ వెళ్లింది! ముఖ్యమంత్రి నితీష్ కుమారే భాజపాకి దూరం జరిగే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మహాకూటమి కీలకం కాబోతున్న అంచనాలు… సహజ మిత్రులైన టీడీపీ లాంటి పార్టీల విషయంలో మోడీ షా ద్వయం అనుసరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో… నితీష్ కుమార్ కూడా కొంత సందిగ్దంలో పడ్డారన్నది వాస్తవం. అయితే, టీడీపీ విషయంలో అనుసరించిన ధోరణి భాజపాకే మైనస్ అయిందన్నదీ అంతే వాస్తవం.
అందుకే, మిత్రపక్షాలను మళ్లీ చేరదీసే కార్యక్రమానికి భాజపా అధ్యక్షుడు అమిత్ షా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తో అమిత్ షా తాజా భేటీ ఆసక్తికరమైన అంశంగా మారింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీ చేయబోతున్నామనీ, రాష్ట్రంలో 40 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నితీష్ తో ఆయన భేటీ అయ్యారు. సాయంత్రం కూడా మరోసారి కలిసి, డిన్నర్ చేశారు. రెండు పార్టీల మధ్యా విభేదాలు ముదురుతున్నాయంటూ కథనాలు రావడం మీడియా సృష్టి అంటూ అమిత్ షా క్లాస్ తీసుకున్నారు! ఇలాంటి ఊహాగానాలు ఆపాలనీ, జేడీయూతో తమ బంధం బాగానే ఉందని అన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జేడీయూ లాంటి పార్టీలను వదులుకోవడానికి భాజపా సిద్ధంగా లేదన్న సంకేతాలు ఈ భేటీ ద్వారా అమిత్ షా మరోసారి ఇచ్చారనే అనుకోవాలి. టీడీపీ విషయంలో తొందరపడ్డారనే అభిప్రాయం జాతీయ స్థాయిలో వ్యక్తం కావడం, దీంతోపాటు మిత్రపక్షాలను దూరం చేసుకోవడం భాజపాకి కలిసొచ్చే అంశం కాదనేది కొన్ని ఉప ఎన్నికల ఫలితాల ద్వారా అనుభవంలోకి రావడంతో… భాజపా వైఖరిలో వస్తున్న మార్పుగా తాజా భేటీని చూడొచ్చు.
అయితే, ఈ మార్పులో కూడా భాజపా రాజకీయంగానే ఆలోచిస్తోందన్నది గమనించాలి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తమపై ప్రభావం పడకూదన్న కోణమే కనిపిస్తోంది. అంతేగానీ, తమ వైఖరి వల్ల జరుగుతున్న ఇతర నష్టాలను పరిగణనలోకి తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. దానికి సాక్ష్యం ఆంధ్రా విషయంలో రోజురోజుకీ పెరుగుతున్న కఠిన వైఖరే.