సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ… ఇప్పుడు జిల్లాల పర్యటనల్లో ఉన్నారు. వీలైనంతగా లో-ప్రోఫైల్ టూర్లు చేస్తున్నారు. సిన్సియర్‌గా …సీరియస్‌గా సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన రాజకీయ రంగ ప్రవేశమే హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న లక్ష్మినారాయణ వివిధ రైతు సంఘాలతో సమావేశమయ్యారు. మౌలికమైన సమస్యలపై చర్చలు జరిపారు. అక్కడ కూడా మీడియా మరోసారి రాజకీయ ప్రశ్నే అడిగింది. ఈ సారి ఎప్పటిలాగే స్పందించినా.. కాస్తంత డిఫరెన్స్ చూపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే..కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. తనకు కావాల్సింది రైతుల సమస్యల పరిష్కారమేనన్నారు.
మాజీ జేడీ లక్ష్మినారాయణ మాటలు వింటూంటే.. ఆయనకు రాజకీయ భాష వంటబట్టినట్లుందనే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే.. రైతుల సమస్యల పరిష్కారం అనేది చిటికెలో అయిపోయేది కాదు. పరిష్కరించగలిగే సమస్యలు ఉంటే ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాయి..? విధానపరమైన లోపాలు ఉంటే.. లక్ష్మినారాయణ లాంటి వాళ్లు డిమాండ్ చేస్తే ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంటుందేమో..? కానీ ఇప్పటికిప్పుడు రైతుల సమస్యలు.. అంటే మద్దతు ధర లాంటి వాటిని .. పరిష్కరించడం ఎలా సాధ్యమవుతుంది..?. ఎలాగోలా.. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడు.. ప్రభుత్వాలు ఈ రైతుల సమస్యలు తీర్చలేకపోతున్నారు కాబట్టి.. ఆ సమస్యల పరిష్కార లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఎవరేమనుకున్నా… తన పని తాను చేసుకుపోతున్నారు. జిల్లా పర్యటనల్లో బిజిగా ఉంటున్నారు. ఏ పార్టీ వారు అన్న విషయంతో సంబంధం లేకుండా.. సందర్భం వస్తే అందర్నీ పలకరిస్తున్నారు. రాజమండ్రి వెళ్లినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలిశారు. కడప వెళ్లి.. ఆమరణదీక్షలో ఉన్న సీఎం రమేష్‌ను కలిశారు. జిల్లాల పర్యటనల్లో ఆయన పరిశీలించిన సమస్యల పరిష్కారం కోసం.. రూపొందించే నివేదికతో.. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళతారో.. రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళతారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. సీబీఐ మాజీ జేడీ వ్యవహారం రాను రాను సస్పెన్స్‌గా మారుతోందే తప్ప క్లారిటీ రావడం లేదు.