విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. తమకు విడదీయరాని బంధం ఉందన్నారు. తన తండ్రి కాలం నుంచి తమనుకాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు గెలిపించిందని గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా… కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆయన బహిరంగంగా ప్రకటించనప్పటికీ… రాహుల్ సమక్షంలో కండువా కప్పుకుని.. ఏఐఐసిసి ఆఫీసులోనే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు.
విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ ఘోరంగా మోసం చేసిందని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో … టీడీపీ, వైసీపీ కూడా.. విభజన హామీలు సాధించడంలోవిఫలమయ్యాయన్నారు. త్వరలో 30,40 మంది ప్రముఖ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని కిరణ్ ప్రకటించారు. ఇది రాహుల్ గాంధీని బలపర్చాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే..దేశానికి సరైన దశ, దిశ వస్తాయన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి… గాంధీ కుటుంబం వల్లే వచ్చిందని… కిరణ్ నిస్సంకోచంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ పదవి అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
రోశయ్య తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి… హయాంలో.. రాష్ట్ర విభజన జరిగింది. హైకమాండ్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే ఫలితం సాధించలేకపోయారు. నాలుగేళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో కిరణ్ పాత్రేమిటన్నదానిపై…స్పష్టత రాలేదు. కిరణ్ సోదరుడు టీడీపీలో ఉండటంతో ఆయన జాతీయ రాజకీయాలవైపు చూస్తారని చెబుతున్నారు.