ఈరోజు ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ 119వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనకు సంబందించిన 100 రహస్య పత్రాలను, కొందరు మంత్రులు, నేతాజీ కుటుంబ సభ్యుల సమక్షంలో బహిర్గతం చేసారు. ఆ రహస్య ఫైళ్ళనన్నిటినీ ఈరోజు మోడీ బహిర్గతం చేసారు కనుక బోస్ మరణం విషయంలో మిష్టరీ వీడే అవకాశం ఉంది.
నేతాజీ ఫైళ్ళను బహిర్గతం చేయాలని చాలా ఏళ్లుగా దేశ ప్రజలు, నేతాజీ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. కానీ ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వాటిని బయపెట్టలేదు. కనుక ఇప్పుడు మోడీ ప్రభుత్వం వాటిని బయటపెడితే కాంగ్రెస్ పార్టీ దానిని స్వాగతించాలి కానీ ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వాళ్ళ ఆ రహస్య ఫైళ్ళను అన్నిటినీ బోస్ కుటుంబ సభ్యుల సమక్షంలోనే బహిర్గతం చేయడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకో చాలా ఉలిక్కిపడినట్లు వ్యవహరిస్తోంది. మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
“కాంగ్రెస్ పార్టీకి చెందిన మేము అందరం బోస్ ని చూసి చాలా గర్వపడుతుంటాము. ఆయన ప్రదర్శించిన అద్భుత దైర్య సాహాసాలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటుంది. కానీ అటువంటి గొప్పవాళ్ళు, మహనీయులని స్వంతం చేసుకోవాలని తాపత్రయపడుతున్న మోడీ ప్రభుత్వం, మొదట వారి గొప్పదనాన్ని తెలియజేసే చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో చాలా మందికి చరిత్ర తెలియని వాళ్ళే ఉన్నారు. మేము ఎప్పుడూ ఆ ఫైళ్ళను బహిర్గతం చేయాలనే కోరుకొన్నాము. ప్రధానమంత్రి మోడీ గుర్తించవలసిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో బోస్ డి.ఎన్.ఏ. ఉందని. కనుక మాకు బోస్ గురించి ఎవరూ మళ్ళీ గుర్తు చేయనవసరం లేదు. అలాగే బోస్ పట్ల మా నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు మాకు ఎవరి నుంచి సర్టిఫికెట్లు అవసరం లేదు,” అని కాంగ్రెస్ పార్టీ నేత టామ్ వడక్కన్ అన్నారు.
అటువంటి మహనీయుడి జీవిత విశేషాలను, ముఖ్యంగా ఆయన అంతిమ దినాలను అంత రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏమిటి? ఆయన గురించి తెలుసుకొనే హక్కు మాకు లేదా? అని దేశ ప్రజలందరూ అడుతున్నారు. ఆ రహస్య ఫైళ్ళను మోడీ ప్రభుత్వం బయటపెట్టడంతో ఇప్పటికయినా బోస్ గురించి నిజాలు తెలుసుకొనే అవకాశం దక్కినందుకు అందరూ చాలా సంతోషిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకో ఉలికి పడుతోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.