లాంఛనం పూర్తయింది. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చేశారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ కు కొత్త ఊపు వస్తుందన్నది హైకమాండ్ వ్యూహం. ఆయనే వచ్చారు కాబట్టి, గతంలో పార్టీ వీడిన ఇతర నేతలు కూడా ఇక ఒక్కొక్కరుగా క్యూ కడతారని భావిస్తున్నారు. కిరణ్ చేరిక పూర్తి కాగానే, రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాల జోరు పెంచేపనిలో హైకమాండ్ ఉంది. పార్టీలో కిరణ్ ఆశిస్తున్నట్టు జాతీయ స్థాయి పదవి ఏదైనా ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మరో టాక్ ఏంటంటే… ఆయనకి ఏపీ పీసీసీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలున్నాయనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పదవులతో సంబంధం లేకుండా ఏపీ కాంగ్రెస్ విషయంలో కిరణ్ కు ఫ్రీ హ్యాండ్ ఇస్తారనీ అంటున్నారు!
కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర, పార్టీలో ఆయన ప్రాధాన్యత, ఆయనకు ఇవ్వబోతున్న పదవి… ఇవన్నీ ఓ పదిహేను రోజుల్లో ఏర్పాటు చేయబోతున్న బహిరంగ సభ తరువాత స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తోంది. త్వరలో ఆంధ్రాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ చేపడుతున్న అతిపెద్ద కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తారట..! ఇది కిరణ్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతుందని సమాచారం! ఈ సభలో ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటివి ప్రధానంగా ప్రస్థావిస్తారు. ఆంధ్రాకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యం, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అధికారం వస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ప్రత్యేక హోదా ప్రకటనతోపాటు ఆంధ్రా సమస్యలన్నీ తీర్చేస్తామనే భరోసా కల్పించాలన్నది ఈ సభ ముఖ్యోద్దేశం.
ఇంకోపక్క, ఇదే సభలో మరికొంతమంది నాయకుల్ని పార్టీలో చేర్చుకునే విధంగా కూడా జాతీయ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్ కు దూరమై, ఇతర పార్టీలకు వెళ్లకుండా తటస్థంగా ఉన్నవారిని ముందుగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఆ తరువాత, టీడీపీ, వైకాపాల్లో అసంతృప్త నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని… పార్టీలోకి ఆహ్వానించాలనే వ్యూహాన్ని ఏఐసీసీ సిద్ధం చేసిందని సమాచారం. అంటే, ఈ మొత్తం వ్యూహం అమలు అంతా ఏపీలో జరిగే బహిరంగ సభ తరువాత మొదలౌతుందని విశ్వసనీయ సమాచారం. నిజానికి, ఈ సభను భారీగా సక్సెస్ చేసినా… ఏపీలో ప్రజల నుంచి కాంగ్రెస్ కు అనూహ్య మద్దతు రాబోతుందన్న అంచనాకు రాలేం. కాకపోతే, కాంగ్రెస్ పట్ల కొంతమంది నాయకుల్లో విశ్వాసం కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుందని వారి అంచనా.