తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు.. ఇప్పుడు కాలం కలసి వస్తోంది. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ర్యాంకుల్లో నెంబర్ వన్ సాధించిన “కిక్”లో ఉండగానే మరో కిక్కిచ్చే సక్సెస్.. అన్న క్యాంటీన్ల రూపంలో వచ్చి పడింది. అన్న క్యాంటీన్లు అలా ప్రారంభించగానే.. ఇలా జనం క్యూ కట్టారు. దాదాపుగా ఒకే రోజు ఏపీ వ్యాప్తంగా రెండు వందల క్యాంటీన్లు ప్రారంభించారు. అదీ కూడా ఆషామాషీగా కాకుండా.. పకడ్బందీ ఏర్పాట్లతో ప్రారంభించారు. నిరుపేదలు కడుపు నిండా భోజనం చేయడానికి ఓ ఆసరా దొరికిందని సంబరపడ్డారు. దానికి సాక్ష్యమే.. సమయం అయ్యే సరికి అన్న క్యాంటీన్ల ముందు బారులు తీరుతున్న జనం.
ప్రభుత్వం కూడా ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ఒక్కో క్యాంటీన్లో పూటకి మూడు వందల మందికి భోజనం, అల్పాహారం అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందిస్తున్నారు. ఆహారపదార్థాలు సరఫరా చేసే బాధ్యతను “అక్షయపాత్ర”కు ఇచ్చారు. క్వాలిటీలోనూ..క్వాంటిటీలోనూ రాజీ పడాల్సిన పని లేదు. సేవా దృక్పథంతో పని చేసే “అక్షయపాత్ర” ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. నిజానికి అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించాలనుకున్నప్పుడు.. చాలా మోడల్స్ పరిశీలించింది. హైదరాబాద్ తరహాలో.. రోడ్డు పక్కన బంకు పెట్టి… భోజనం పెట్టేస్తే.. తక్కువ ఖర్చుతో బయటపడొచ్చన్న అభిప్రాయం కొంత మందిలో వ్యక్తమయింది. కానీ చంద్రబాబు… ఆంధ్రప్రేదశ్ ప్రజల మైండ్‌సెట్‌ను చదివారు. అలా అయితే.. ఆదరణ ఉండదని భావించారు. అందుకే.. హోటళ్ల మాదిరిగా.. అన్న క్యాంటీన్ల ను డిజైన్ చేయించారు. ఇది కూడా.. ఈ పథకం ప్రజల్లోకి వెళ్లడానికి మరో కారణం.
నిజానికి రోజుకూలీలు, డ్రైవర్లు, ఎప్పుడూ బయటే పని చేసుకునేవాళ్లు ..నగరాల్లో మధ్యాహ్న భోజనానికి చాలా ఇబ్బంది పడుతూంటారు. అలాంటి వారికి ఇవి కడుపునిండా అన్నం పెడుతున్నాయి. ఆకలి తీర్చుకున్న వంద మందిలో.. సగం మంది అయినా “అన్నదాత సుఖీభవ” అని అనుకుంటే.. అన్న క్యాంటీన్ల లక్ష్యం నెరవేరినట్లే. విమర్శలు చేసే వాళ్లూ ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. గంట సేపే ఉంటుందని… రెండో రోజే మూసేశారని.. విమర్శించడానికి కారణాలు వెదుక్కుంటూనే అంటారు. ఎప్పటికప్పుడు లోపాలు సవరించుకుంటూ.. పేదల ఆకలి తీర్చే విషయంలో రాజీ పడకపోతే… కిలో రూ.2 బియ్యం ఎలా ఎన్టీఆర్‌కు పేదల గుండెల్లో స్థానం నిలిపిందో.. ఇప్పుడీ పథకం..చంద్రబాబుకు అలాంటి స్థానం కల్పిస్తుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది వేల కోట్లు ఖర్చు పెట్టి చేసే సంక్షేమ పథకాలతో కూడా రాని గౌరవం.