సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి గా పనిచేసి , ఆ తర్వాత సమైక్యాంధ్ర అనే రాజకీయ పార్టీని ప్రారంభించి , 2014 ఎన్నికలలో ఆ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపి, ఎన్నికలయిపోయాక రాజకీయ అజ్ఞాతవాసం లోకి వెళ్లి నాలుగేళ్ల తర్వాత, సరిగ్గా ఎన్నికల ఏడాది తిరిగి సొంత గూటికి చేరుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మరి ఈ చేరిక ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది , ఎలాంటి సమీకరణలకు దారి తీస్తుంది చూద్దాం.
హైకమాండ్ పై కిరణ్ కుమార్ రెడ్డి తిరగబడ్డప్పుడు ప్రజల అభిప్రాయాలు:
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయితే, ఆ తర్వాత రాజశేఖరరెడ్డి చనిపోయాక ఉన్నవాళ్ల లో సీనియర్ అనే ప్రాతిపదికమీద రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ రోశయ్య ని మార్చాలి అనుకున్నప్పుడు -చాలామంది, తెలంగాణ ఉద్యమం ఊపు లో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందని కొందరు భావిస్తే, జగన్ మోహన్ రెడ్డి ఉదంతం తర్వాత కాంగ్రెస్ కాపులను దగ్గరకు తీయాలి అని అనుకుంటోంది కాబట్టి కాపులకి ముఖ్యమంత్రి పదవి వస్తుందని మరికొందరు భావించగా, అలాంటి వాళ్ళ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ, ఆశావహులు గా ఉన్న సీనియర్లను కాదంటూ ఎప్పుడూ కనీసం మంత్రిగా కూడా పని చేయని కిరణ్ కుమార్ రెడ్డిని , ఏ సమీకరణాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రిగా చేసిందనేది “ చిదంబర” రహస్యం.
అయితే కేవలం హైకమాండ్ కారణంగా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి, విభజన సమయంలో వాళ్ళకి ఎదురు తిరగడం ప్రజలని చాలా ఆశ్చర్యపరచింది. ఒక వర్గం ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా ఉండి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి ఎదురుతిరిగాడు అంటే తన రాజకీయ భవిష్యత్తును సైతం పణంగా పెట్టారని, తన అంతరాత్మ మేరకు ఈయన నడుచుకుంటున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రికి మనమందరం మద్దతిచ్చి తీరాలని అభిప్రాయపడ్డారు. అయితే మరి కొందరు మాత్రం ఇది కూడా కాంగ్రెస్ హైకమాండ్ నాటకంలో భాగమేని, ప్రజల్లోని కోపాన్ని డైవర్ట్ చేసి ఒక “సేఫ్టీ వాల్వ్” లాగా, కాంగ్రెస్ పెద్దల సూచన మేరకే నడుచుకుంటున్నారని ,ఇప్పుడు తిరగబడినా, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని వీళ్ళు అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వాళ్లలో ప్రముఖంగా వైయస్సార్ సిపి నాయకులు ఉన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సేఫ్టీ వాల్వ్ లాగా పని చేశాడా?
రాజకీయాల్లో , రాజనీతిలో ఈ సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం ఎప్పటినుంచో ఉంది. ఉదాహరణకి ఒక ప్రెజర్ కుక్కర్ ఉందంటే అందులో ప్రెజర్ ఎక్కువైనప్పుడల్లా, ఆ ప్రెజర్ సేఫ్టీ వాల్వ్ ద్వారా విడుదల అవుతూ ఉంటుంది. ఒకవేళ సేఫ్టీ వాల్వ్ లేకపోతే కుక్కరే బద్దలయ్యే అవకాశం ఉంది. 1885 లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఇలాంటి “సేఫ్టీ వాల్వ్” సిద్ధాంతం చర్చల్లోకి వచ్చింది. 1885లో కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఎ.ఓ. హ్యూమ్ అనే బ్రిటిష్ అధికారి. అప్పటి బ్రిటీష్ వైస్రాయి లార్డ్ డఫ్రిన్ తానే స్వయంగా ఆ అధికారితో ఈ పార్టీ పెట్టించాడు అనేది ఆ సిద్ధాంతం. అప్పటికీ వందేళ్ల కిందటే బ్రిటిష్ వాళ్ళు చిన్న చిన్న రాజ్యాలను ఓడించి బ్రిటీష్ సామ్రాజ్యంలో కలుపుకుంటూ వెళ్తున్నప్పటికీ బ్రిటిష్ వారి మీద వ్యతిరేకత మొదటి వందేళ్లు పెద్దగా లేదు. పైగా రైలు వేయించడం, సతీసహగమనం నిషేధించడం లాంటి వేర్వేరు కారణాలతో బ్రిటిష్ ప్రభుత్వం మీద మధ్యతరగతిలో కాస్త సానుకూలత ఉండేది. అయితే ఆ సానుకూలత స్థానంలోకి వ్యతిరేకత వచ్చే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. అందువల్ల సేఫ్టీ వాల్వ్ సిద్ధాంతం అనేది చర్చల్లోకి వచ్చింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత మరే వైపుకీ మళ్ళకుండా, ఒక “ఛానెలైజ్డ్” మార్గం లో కాంగ్రెస్ ద్వారా మాత్రమే ఆ ప్రతికూలత వెల్లడి కావడానికి కాంగ్రెస్ ని ఏర్పాటు చేసారనేది ఆ సిద్దాంతం. అయితే ఆ తర్వాతి కాలంలో భారతీయులు ఈ సిద్ధాంతాన్ని తిప్పికొట్టారు అది వేరే విషయం.
Click here for Part 2 : కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక (పార్ట్-2): భవిష్యత్ సమీకరణాలు
2014 లో, కిరణ్ కుమార్ రెడ్డి చేసింది సేఫ్టీ వాల్వ్ లాంటిదే నా?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించగానే, సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రతి కుటుంబమూ ప్రతి పౌరుడు ఏదో ఒక సమయంలో రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలియజేశారు. అయితే ఆ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రులలో ఆశలు కల్పించారు. స్వయంగా తానే హైకమాండ్ మీద తిరగబడడంతో ప్రజల్లో ఆయన ఇమేజి విపరీతంగా పెరిగింది. తాను క్రికెటర్ అని, చివరి బంతి దాకా ఆడడం తన నైజం అని చెబుతూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి “ఏదో ఒకటి చేసి కిరణ్ కుమార్ రెడ్డి అండ్ కో విభజనను ఆపుతారు” అనే భావన విస్తృతంగా ప్రజల్లో కల్పించారు. అయితే ఆ చివరి బంతి వచ్చేసరికి చేతులెత్తేశారు.
కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పని వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టం ఏంటి
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విభజనను ఆపుతామని ప్రకటించడం వల్ల, ప్రజల్లో కూడా ఫోకస్ మొత్తం విభజనను ఆపడం మీద, సమైక్యాంధ్రను కొనసాగించడం మీద ఉండిపోయింది. ఒకవేళ విభజన ఆపడం అసాధ్యం అని ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూడడం మీద ఫోకస్ చేయడం ముఖ్యం అని గనక ముఖ్యమంత్రి కానీ మరి కొంతమంది నాయకులు గానీ ప్రకటించి ఉంటే – కనీసం ఆ విభజన చట్టాన్ని మార్చడం మీద పూర్తి ఫోకస్ ఉండి ఉండేది. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పొందుపరచకపోవడం, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ హైదరాబాద్ రెవెన్యూను రెండు రాష్ట్రాల మధ్య పంచకపోవడం, విభజన హామీలు (రైల్వే జోన్ మరియు ఇతరత్రా ) ఎప్పటి లోగా పూర్తి చేయాలనే దాని మీద చట్టంలో స్పష్టత ఇవ్వకపోవడం – ఇవి ప్రస్తుత ఆంధ్ర దీన పరిస్థితి ప్రధాన కారణాలు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి విభజనను ఆపి తీరుతామని ప్రజల ఫోకస్ మొత్తం సమైక్యాంధ్ర ఉద్యమం మీదకి మళ్లించకుండా ఉండి ఉంటే, ప్రజలను సరైన రీతిలో ముందుచూపుతో గైడ్ చేసి ఉంటే ఇవాళ విభజన చట్టం మరొకలా ఉండి ఉండేది.
ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి జరిగిన అన్యాయం మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి వల్ల జరిగింది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ సరైన సమయంలో ఒక “సేఫ్టీ వాల్వ్” లాగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ మీద వ్యతిరేకత ఒక “చానలైజ్డ్” మార్గం లో మాత్రమే వెల్లడయ్యే లా సహాయపడ్డారు. దీంతోపాటు అందరి దృష్టి సమైక్యాంధ్ర ఉద్యమం మీదకు మళ్లటం వల్ల తెలంగాణ విభజన చట్టం ఏకపక్షంగా ఉండిపోవడానికి కారణం అయ్యారు.
కట్ టూ 2018, బ్యాక్ ఇంటూ కాంగ్రెస్:
పైన చెప్పిన కారణాల కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి కేవలం కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సూచన మేరకే ఒక సేఫ్టీ వాల్వ్ లాగా వ్యవహరించాడు అని చెప్పగలిగి ఉండేవాళ్లం కాదు. ఆయన నిజంగానే తన అంతరాత్మ మేరకు కాంగ్రెస్ పెద్దలకు తిరగబడి ఉండవచ్చు అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగానే ఉంది. అయితే ఆయన, తర్వాత బిజెపి లోనో లేదా మరే ఇతర కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలోనే చేరి ఉన్నా, లేదంటే సొంత పార్టీ పెట్టి రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకునే ప్రయత్నం చేసినా ఆయన కాంగ్రెస్‌పై నిజంగానే తిరగబడ్డాడు అన్న వాదన నిజం అయి ఉండేది. కానీ అప్పట్లో ఒక వర్గం విశ్లేషించినట్లు గా ఆయన సరిగ్గా 2019 ఎన్నికలకు ఏడాది ముందు తిరిగి సొంత గూటికి చేరుకోవడంతో ఆయన సేఫ్టీ వాల్వ్ గా పనిచేశారు అనే విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్లయింది.
పైగా పార్టీ నుండి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి తెచ్చుకోవడం ఏ పార్టీకైనా మామూలు విషయమే. కానీ కిరణ్ కుమార్ రెడ్డి అండ్ కో ని కాంగ్రె స్ హైకమాండ్ అప్పట్లో సస్పెండ్ చేసింది. అప్పట్లో సస్పెండ్ చేసిన వాళ్లని ఇప్పుడు తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా “సేఫ్టీ వాల్వ్” విమర్శలకు స్వయంగా కాంగ్రెస్ బలం చేకూర్చినట్లయింది.
మరి ఇలాంటి నేపథ్యం లో కిరణ్ చేరిక తో భవిష్యత్ సమీకరణాలు ఎలా మారనున్నాయనేది తదుపరి భాగం లో చూద్దాం
– జురాన్