పఠాన్ కోట్ దాడికి సరిగ్గా ఒకరోజు ముందు ఆ ప్రాంతమలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా చేస్తున్న సల్వీందర్ సింగ్ ని ఉగ్రవాదులు కొట్టి ఆయన పోలీస్ వాహానాన్ని ఎత్తుకు పోయారు. ఆ మరునాడు అదే వాహనంలో వారు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి ప్రవేశించి దాడులు చేసారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్.ఐ.ఏ. అధికారులు సల్వీందర్ సింగ్, ఆయన వంటవాడిని అదుపులోకి తీసుకొని గత రెండు వారాలుగా ప్రశ్నించారు.
మొదట ఆయనను అరెస్ట్ చేసినప్పుడు అయన పోలీస్ అధికారి అయినప్పటికీ కొంత తడబాటుకి గురవడం చేత పొంతనలేని సమాధానాలు చెప్పారు. దానితో మీడియా కూడా ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అనేక ఊహాజనితమయిన కధనాలు ప్రచురించింది. ఎన్.ఐ.ఏ. అధికారులు ఆయనకి లై- డిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహించేరు. వారి ఇళ్ళలో సోదాలు కూడా నిర్వహించారు. సుదీర్గ విచారణ తరువాత ఆయనకి ఉగ్రవాదులతో కానీ, ఈ దాడితో గానీ ఎటువంటి సంబందమూ లేదని తేల్చి చెప్పారు. దానితో సల్వీందర్ సింగ్ పై కమ్ముకొన్న అనుమానాలు పటాపంచలయిపోయాయి. ఆయన త్వరలో మళ్ళీ విధులలో చేరుతారు. ఒక ఉన్నతస్థాయిలో ఉన్న పోలీస్ అధికారికి ఇటువంటి విచిత్రమయిన, చాలా భయం, అవమానం కలిగించే పరిస్థితులు ఎదుర్కోవలసి రావడం చాలా విచిత్రంగానే ఉంది. కానీ ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డారు.