విశిష్ట సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఆంధ్రాలో కూడా మొదలుపెట్టారు భాజపా నేతలు. దీన్లో భాగంగా భాజపా నాయకురాలు పురందేశ్వరి కాకినాడలో పర్యటించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి, భాజపా చేసిన అభివృద్ధిని వివరించారు. మోడీ సర్కారు చేస్తున్న అభివృద్ధిని ప్రసార మాధ్యమాలు సరిగా ప్రజలకు చెప్పడం లేదనీ, అందుకే తమ కార్యకర్తలే ప్రసార మాధ్యమాలుగా తయారై, ప్రజల్లోకి వెళ్తారని పురందేశ్వరి చెప్పారు. కేంద్రమంత్రి నితిన్ గట్కరీ రాష్ట్రానికి వచ్చారనీ, పోలవరంతో సహా వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన కీలక సమీక్షలు చేస్తే… మీడియాలో ఈ వార్తలకు ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు!
వేలాది కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని మొదటి పేజీల్లో వేయ్యాలన్నారు! రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున వనరులు అందిస్తే… అలాంటి కథనాలను ఎక్కడో పదో పేజీలోనో పదకొండో పేజీలోనో పడేశారని మీడియాపై పురందేశ్వరి మండిపడ్డారు! తమకు సరైన మద్దతు ప్రసారమాధ్యమాల్లో లేని పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజల్లోకి తామే వస్తున్నామని చెప్పారు. గడచిన కొన్ని నెలలుగా ఆంధ్రాలో కేంద్రంపై దుష్ప్రచారం మరింత ఉద్ధృతమైందన్నారు. కేంద్రం ఆంధ్రాకి సహకరించడం లేదు, నిధులు ఇవ్వడం లేదు, అభివృద్ధికి విఘాతం కలిగిస్తోందనే దుష్ప్రచారం తీవ్రంగా జరుగుతున్న సంగతి ప్రజలకు తెలుసు అన్నారు. పోలవరంతో సహా ఆంధ్రాకి సహకారం అందించడానికి కేంద్రం వెనకాడదనీ, కాకపోతే తమ అవసరాలను ఢిల్లీకి వచ్చి కేంద్రాన్ని స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంటుందని పురందేశ్వరి చెప్పారు. ప్రధాని మోడీగానీ, మంత్రి గట్కరీగానీ, ఇతర కేంద్రమంత్రులు ఎవరైనాగానీ.. ఆంధ్రాకి సహకరించబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
విచిత్రం ఏంటంటే… వారు చేయని అభివృద్ధి గురించి, అందించని సాయం గురించి మీడియా రాయాలంటే ఎలా..? ప్రసార మాధ్యమాలకు కూడా ప్రాథమ్యాలు ఎలా ఉండాలో భాజపా నేతలే దిశానిర్దేశం చేస్తుంటే ఏమనుకోవాలి..? ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల విషయమై కేంద్రం చేసిన మేలేంటి.? రైల్వేజోన్, కడప ఫ్యాక్టరీ, వెనకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు… ఇలాంటివన్నీ ఇస్తే, మీడియా ఎందుకు మెచ్చుకోదు..? ఆ మధ్య, ప్రత్యేక హోదాకి బదులు, అవే స్థాయి ప్రయోజనాలను ప్యాకేజీ ద్వారా ఆంధ్రాకి అందిస్తామని చెప్పినప్పుడు భాజపాని నెత్తినపెట్టుకున్నది ఈ మీడియానే కదా! భాజపా చేసిన నమ్మక ద్రోహానికి ఆంధ్రుల్లో ఆగ్రహం ప్రబలితే… ఆ అభిప్రాయాన్ని మీడియా ప్రతిబింబిస్తోంది.
ఇక, ఆంధ్రా విషయంలో ప్రధాని మొదలుకొని సహకరించమని ఎవ్వరూ చెప్పలేదన్నారు పురందేశ్వరి! సరే, మరి కడప ఫ్యాక్టరీ విషయంలో సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ను ఏమనాలి..? అది సహాయ నిరాకరణ కాదా..? రైల్వే జోన్ విషయమై ఈ మధ్యనే కేంద్రమంత్రి ఎలా మట్లాడారు…? కేవలం పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందనీ, తాము సాధ్యాలను పరిశీలించామంటూ నాలుగేళ్ల తరువాత చేసిన వ్యాఖ్యానాలు సహాయ నిరాకరణ కదా..? ఇన్ని లోపాలు పెట్టుకుని తాము చేసిన అభివృద్ధిని ప్రసార మాధ్యమాలు సరిగా ప్రసారం చేయడం లేదని అనేస్తే ఎలా..?