స్వామీజీలు, సాధువులు రాజకీయాలు చేయడం అనేది దక్షిణాదిలో లేదు. కానీ, ఉత్తరాదికి చెందిన చాలామంది ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు. నిజానికి, స్వామీజీలను బరిలోకి దించడం అనేది భాజపాకి బాగా కలిసొచ్చిన ఫార్ములా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ని కూడా దశలవారీగా భాజపా నేతను చేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, దక్షిణాదిలో పార్టీని విస్తరించాలని ఆరాటపడుతున్న భాజపాకి స్వామీజీ ఫార్ములానే ఇక్కడ వాడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇతర అంశాలేవీ భాజపాకి దక్షిణాదిన రాజకీయంగా కలిసొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి, ఇక్కడా స్వామీజీలను ప్రోత్సాహం ఇచ్చి, టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉందనే వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారమూ ఈ మధ్య అక్కడక్కడా వినిపిస్తోంది.
తెలంగాణ నుంచి పరిపూర్ణానంద రాజకీయ కెరీర్ మొదలౌతున్న అభిప్రాయం వ్యక్తమైంది. సికింద్రాబాద్ నుంచి ఆయనకి ఎంపీ టిక్కెట్ ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పటికే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారట! ఆ వ్యూహంతోనే కత్తి మహేష్ వివాదం నేపథ్యంలో పరిపూర్ణానందకు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేశారు. అయితే, దీన్ని ముందుగా అంచనా వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపా వ్యూహాన్ని దెబ్బ తీస్తూ స్వామీజీని కూడా నగరం నుంచి బహిష్కరించేశారు. దీంతో ఇప్పుడు భాజపా వ్యూహం ఏంటనేది ప్రశ్నగా మారిందని సమాచారం. ఎన్నికల నాటికి ఏదో ఒక అంశం ద్వారా పరిపూర్ణానంద మరోసారి తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందనే అంచనా కూడా ఉంది.
రాజకీయంగా చూసుకుంటే… యోగీ ఆదిత్యనాథ్ బాటలోనే పరిపూర్ణానంద ఉన్నారని చెప్పొచ్చు. అంటే, ఈయన సీఎం స్థాయికి వెళ్లిపోతారని చెప్పడం కాదు. ఇద్దరి మధ్యా కొన్ని సారూప్యతలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందు యోగీ ఆదిత్యనాథ్ కూడా హిందూ దర్మ పరిరక్షణ అంటూ ఉద్యమించారు. ఇతర మతాల నుంచి హిందుత్వంలోకి తిరిగి వచ్చేవారిని ఆహ్వానించే కార్యక్రమాలు చేశారు. మత మార్పిడులు తగ్గించడం కోసం ప్రజల్లోకి వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. పరిపూర్ణానంద కూడా ఇదే తరహా కార్యక్రమాలతో పాపులర్ అయ్యారు. హిందూ ధర్మానికి విఘాతం కలిగేలా ఎవరు మాట్లాడినా ఈయన తెరమీదికి వస్తుంటారు. కాబట్టి, ఇలాంటి స్వామీజీని తమ పార్టీ తరఫున ఎన్నికల్లోకి దించాలని భావించింది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడేం చేస్తారనేదే వేచి చూడాల్సిన అంశం.