అర్ధనగ్న ప్రదర్శనతో, చిత్రసీమలో ప్రముఖులపై అనుచిత ఆరోపణలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. తెలుగు చిత్రపరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్, సెక్సువల్ హెరాస్‌మెంట్ తదితర అంశాలకు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన చేసేవరకూ శ్రీరెడ్డి ఎవరో ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. మంచు లక్ష్మి మాట కూడా ఇదే. ఇన్‌డైరెక్టుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న ప్రదర్శనపై తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ప్రస్తావిస్తూ… “మొన్నామధ్య ఆ సంఘటన జరిగేవరకూ ఆవిడెవరో నాకు తెలీదు. పదేళ్లుగా పరిశ్రమలో వున్నానని చెబుతోంది. సుప్రియ (నాగార్జున మేనకోడలు), స్వప్న (అశ్వనీదత్ కుమార్తె), నేను… ఇలా ఓ ఐదారు మంది మహిళా నిర్మాతలు వున్నాం. మాలో ఎవరికీ తానెవరో తెలీదు” అని చెప్పారు. శ్రీరెడ్డి పేరు ప్రస్తావించడానికి కూడా మంచు లక్ష్మి ఇష్టపడలేదు.
శ్రీరెడ్డిపై మంచు లక్ష్మి సెటైర్స్ వేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరపున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాస్టింగ్ కౌచ్ అంశంలో శ్రీరెడ్డిపై మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ సెటైర్స్ వేశారు. తరవాత శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో విరుచుకుపడి సోషల్ మీడియాలో నానా హంగామా చేశారనుకోండి. ఇప్పుడు ఏమంటారో మరి. ఇప్పుడు తెలుగులో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని తమిళ పరిశ్రమ ప్రముఖులపై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
జూనియర్ ఆర్టిస్టులకు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఫిల్మ్ ఛాంబర్ తరపున వేసిన సమన్వయ కమిటీలో మంచు లక్ష్మి సభ్యురాలు. ఇటీవల జూనియర్ ఆర్టిస్టులను పిలిచిన సమన్వయ కమిటీ వాళ్ల సమస్యలను తెలుసుకుని, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని ఆరా తీసింది. జూనియర్ ఆర్టిస్టులకు మేమున్నామని భరోసా ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని మంచు లక్ష్మి తెలిపారు. ఎవరికైనా సమస్యలు వుంటే వాటిని వివరంగా రాసి ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్‌లో లెటర్ వేస్తే చర్చలు తీసుకుంటామని స్పష్టం చేశారు.