తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పుడు సైలెంటయ్యారు కానీ.. కొద్ది రోజుల కిందట.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ పేరుతో.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగడదామనుకున్నారు. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ విధానాలపైనా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అదే ఊపులో మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్, దేవేగౌడ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్‌లతో సమావేశమయ్యారు. రెండు జాతీయ పార్టీలను బొంద పెడుదామని… పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రయత్నాలపై.. విమర్శలు కూడా వచ్చాయి. కేవలం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న, పెట్టుకునే అవకాశం ఉన్న పార్టీలనే కలిసి.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో …దువ్వుతున్నారని… బీజేపీ మిత్రపక్షాలను పట్టించుకోకపోవడం వెనుక రాజకీయం ఉందన్న ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా.. ప్రస్తుతానికి ఫెడరల్ ఫ్రంట్ విషయానికి కేసీఆర్ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.
కానీ తాను చూపించిన ఫెడరలిజం కారణంగా.. కొత్త చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పక్కన పెట్టేసిన ఫెడరలిజం నినాదాన్ని ఇప్పుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెట్ స్టాలిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ తరపున చెన్నైలో “రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – ఫెడరలిజం” అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి ప్రాంతీయ పార్టీల అధినేతలందర్నీ ఆహ్వానిస్తున్నారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ఇళంగోవన్‌కు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు పంపి.. స్టాలిన్.. కేసీఆర్‌కు ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఓ లేఖ కూడా పంపించారు.
“రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి – ఫెడరలిజం” అనే మాట ఇప్పుడు వినిపిస్తే.. అందరూ బీజేపీ వైపే అనుమానంగా చూస్తున్నారు. ఎందుకంటే.. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. ఆర్థిక సంఘం విధివిధానాలు కూడా.. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్చను హరించేలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సదస్సు జరిగేది కూడా ఇలాంటి అంశాలపై చర్చించడానికే.. ! అంటే కచ్చితంగా ఆ సదస్సులో ..బీజేపీకి, నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలంతా గళం వినిపించడం ఖాయం. ఇది ప్రస్తుత టీఆర్ఎస్ విధానానికి విరుద్ధం.
గతంలో తాను ప్రత్యేకంగా చెన్నై వెళ్లి “ఫెడరల్ ఫ్రంట్” ప్రస్తావనను స్టాలిన్ ముందు ఉంచినందున.. ఇప్పుడు అదే అంశంపై ఏర్పాటు చేస్తున్న సమావేశానికి వెళ్లకపోతే.. కేసీఆర్ రాజకీయ సిద్దాంతాలపైనే జాతీయ స్థాయిలో అపనమ్మకం ఏర్పడుతుంది. కేసీఆర్ చేసిన ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ కోసమే అన్న నమ్మకం బలపడుతుంది. జాతీయ నేతలెవరూ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతానని కేసీఆర్ చెబితే నమ్మరు. అలా అని సదస్సుకు వెళితే.. బీజేపీపై యుద్ధం ప్రకటించిన వారిలో ఒకరైపోతారు. ఈ పరిస్థితిని కేసీఆర్ కోరుకోరు. అందుకే.. కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడుతోంది. ఇది కేసీఆర్ ఫెడరలిజానికి అసలైన పరీక్ష అని చెప్పుకోవచ్చు.