వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించింది. పార్టీ నేతలతో సమావేశమైన జగన్.. ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం.. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమట. నాలుగేళ్లుగా బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడే ఒక్కసారిగా ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఎందుకు గుర్తొచ్చిన్నంది రాజకీయవర్గాలకు ఆసక్తికరంగా మారింది. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది. అసలు బీజేపీ మద్దతు అడగను కూడా అడగలేదు. కానీ వైసీపీ అధినేత జగన్.. అత్యంత రహస్యంగా… ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్మెంట్ తీసుకుని కలసి మరీ .. మరో షరతు లేకుండా మద్దతు ప్రకటించారు.
జగన్ మద్దతు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రకటించింది. తన బద్దశత్రువైన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నా… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ ఎలాంటి షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చింది. అసలు ఎలా మద్దతు ఇస్తుంది..?. మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ప్రతిపక్షాలు.. అనేక అంశాల్లో పార్లమెంట్ బయట, లోపల ప్రతిపక్షాలు.. అనేక సార్లు ఆందోళనలు చేశాయి. కానీ ఎక్కడా విపక్షాల సమావేశాల్లో వైసీపీ కనిపించలేదు. జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు.. పెట్రోల్, డీజిల్ చార్జీల పెరుగుదలపైనా బీజేపీపై ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం చేయలేదు.
కానీ ఇప్పుడు అనూహ్యంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల కోసం మాత్రం బీజేపీకి మద్దతివ్వకూడదని నిర్ణయించారు. అదే సమయంలో రాజ్యసభ ఎంపీలు మాత్రం.. సభలో ఆందోళన చేయకుండా.. కేవలం.. పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. మొత్తంగా పరిశీలిస్తే… మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడదల్చుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. బీజేపీతో అంటకాగినట్లు.. కనిపించకుండా ఉండాలంటే.. బీజేపీకి వ్యతిరేకంగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. భారతీయ జనతా పార్టీ హామీలను అమలు చేయలేదని ఇప్పటికైగా గుర్తించారు కాబట్టి.. కేంద్రం టార్గెట్‌గా … వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు … ఎటాక్ ప్రారంభిస్తారా లేదా అన్న సస్పెన్స్‌గా మారింది. ఇంత వరకూ.. కేంద్రం వైపు నుంచి రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతున్నా.. ఒక్కటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడైనా బీజేపీ హామీలు అమలు చేయలేదని.. గుర్తించారు కదా..మరి మాట్లాడతారా..? మోడీని విమర్శిస్తారా…?