సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి స్వతహాగా.. సాక్షి మార్క్ జర్నలిజానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయనను సాక్షిలో ఎడిటోరియల్ డైరక్టర్‌గా తీసుకున్నప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ రామచంద్రమూర్తిపై జగన్ నమ్మకం ఉంచారు. రామచంద్రమూర్తి కూడా.. జగన్ కు కావాల్సిన జర్నలిజాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం వేమూరి రాధాకృష్ణ రాసే … వీకెండ్ కామెంట్‌కు పోటీగా.. త్రికాలం పేరుతో ఓ ఆర్టికల్ చాలా కాలం నుంచి రాస్తున్నారు. అయితే అంత టెంపో అందులో ఉండదు. ఏకపక్షంగా రాసినట్లు అర్థమైపోతూనే ఉంటుంది. వైసీపీ అభిమానులకు కావాల్సింది అదే కాబట్టి.. పెద్దగా పేచీ రాలేదు.
కానీ ఈ ఆదివారం అంటే.. పదిహేనో తేదీన ఆయన రాసిన త్రికాలం ఆర్టికల్ మాత్రం… ఏదో తేడా కొడుతోందన్న అభిప్రాయం..వైసీపీ అభిమానుల్లో వచ్చేలా చేసింది… కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడం వల్ల.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని… చెప్పాలని రామచంద్రమూర్తి ఆ కాలంలో తాపత్రయ పడ్డారు. దీనికి కారణం కొద్ది రోజులుగా… కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే… వైసీపీ ఓటు బ్యాంక్ నాలుగైదు శాతం అయినా… కాంగ్రెస్ వైపు వెళ్తుందన్న విశ్లేషణలు వచ్చాయి. తెలుగు 360 కూడా ఇదే విశ్లేషణ చేసింది. దీన్ని తిప్పికొట్టడానికన్నట్లు రామచంద్రమూర్తి త్రికాలం ఆర్టికల్ రాశారు. కానీ… అసలు విషయాన్ని ఆయన చెప్పకుండా… తప్పులు తడకలతో.. వైసీపీ చరిత్రను వక్రీకరించి.. కాస్తంత నెగెటివ్ భావన వచ్చేలా దాన్ని రాసుకొచ్చారు.
అంతే కాదు.. గత ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చారు. అప్పుడు ఎలాంటి నష్టం జరగకపోతే..ఇప్పుడు .. ఇంత పెద్ద ఆర్టికల్ ఎందుకు రాయాలన్నది..వైసీపీ కార్యకర్తల వాదనగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా… కనీసం పది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో ఓడిపోయారని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ప్రభావం లేదని ఎలా చెబుతారంటున్నారు. కిరణ్ వల్ల వైసీపీ నష్టం జరిగిందని.. అయన ఉన్నారని కాంగ్రెస్ వైపు వెళ్తే తెలుగుదేశం పార్టీకి లాభం జరుగుతుందన్న భావన వచ్చేలా చెప్పాలి కానీ.. అసలు కిరణ్ లెక్కలేడని చెప్పడానికి ఇంత ప్రయాస పడటం ఎందుకని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
నిజానికి రామచంద్రమూర్తిపై జగన్‌కు విశ్వాసం ఉందేమో కానీ ఆయన ఆ పత్రికలో చేరినప్పటి నుంచి జరుగుతున్న వ్యతిరేక ప్రచారం అంతా ఇంతా కాదు. ఎప్పుడో .. ఏదో ఓ సందర్భంలో చంద్రబాబు ప్రధాని కావాలని ఆయన కోరుకున్నారు. దాన్ని ఇప్పటికీ ఏదో సందర్భంలో బయటకు తీసి ఆయనను శంకిస్తూనే ఉన్నారు. ఇప్పుడు “త్రికాలం” వల్ల ఇప్పుడు మరోసారి అలాంటి విమర్శలే ఎదుర్కొంటున్నారు. ఇందతా ఆ పత్రిక ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో ఉన్న ఆధిపత్య పోరాటం వల్ల జరుగుతోందనేవారూ లేకపోలేదు.