కేంద్ర కేబినెట్ మంత్రి రాందాస్ అథవాలే.. తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చి ..చంద్రబాబు ఓపిక పట్టి ఉంటే.. మోదీ ప్రత్యేకహోదా ఇచ్చేవారని చెబుతారు. ఇప్పటికీ మించిపోయిందని లేదని..జగన్ ఎన్డీఏలోకి వస్తే.. ప్రత్యేకహోదా విషయాన్ని ప్రధాని వద్దకు పరిశీలనలో పెట్టేలా చేస్తానని ప్రకటనలు చేస్తారు. నిజానికి రాందాస్ అథవాలే.. హైదరాబాద్లో మాత్రమే ఈ ప్రకటనలు చేయలేదు. గతంలో విజయవాడ పర్యటనకు వచ్చినప్పుడు కూడా.. ఇాలంటి ప్రకటనలు చేశారు. అప్పుడు బీజేపీ నేతలెవరూ ఖండించలేదు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్డీఏలో ఓ పార్టీ మాత్రమే. ఇతర పార్టీలను ఆహ్వానించడం.. వాటికి హామీలివ్వడం అనేది ఆర్పీఐ అధ్యక్షుడు అధవాలే సొంతగా చేజిక్కించుకుంటున్న అధికారంగానే భావించాలి. అలా అయినప్పుడు ..మొదటి సారి విజయవాడకు వచ్చినప్పుడే దానిని ఖండించాల్సి ఉంది. కానీ బీజేపీ నేతలెవరు ఖండించలేదు.
ఇక మరోసారి ఇలాంటి ప్రకటన చేయడానికేనన్నట్లు హైదరాబాద్ వచ్చిన అథవాలే.. ప్రత్యేకహోదా అంశానికి మసాలా జోడించి ప్రకటనలు చేశారు. నిజానికి ప్రత్యేకహోదా ఇస్తామన్న పార్టీకే మద్దతిస్తామని.. వైసీపీ చెబుతోంది. అందుకే అథవాలే ఆ ప్రకటన చేశారు. దీంతో సహజంగానే బీజేపీ – వైసీపీ మధ్య బంధం క్లియర్ చేయడానికి అధవాలే ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. అధవాలే రాజేసిన రాజకీయ వేడి అలా ఉండగానే… ఏపీ బీజేపీ ముఖ్యనేత పురందేశ్వరి మరో ప్రకటన చేశారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని తేల్చేశారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ సిద్దంగా లేదని విమర్శిస్తున్నారు.
అటు అధవాలే.. ఇటు పురందేశ్వరి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకహోదా విషయంలో ఇప్పటి వరకూ సాధ్యం కాదని చెప్పిన బీజేపీ.. వ్యూహాత్మకంగా … మిత్రపక్షం.. అదీ కేంద్రమంత్రితో.. ఓ మాదిరిగా ప్రత్యేకహోదా విషయంలో సానుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తోంది. పైగా ఈ మంత్రి మహారాష్ట్రకు చెందిన వారు. గతంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని మహారాష్ట్ర బీజేపీ నేతలే ప్రకటనలు చేశారు. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రితో సానుకూల ప్రకటనలు చేయించారు. మరో వైపు.. సొంత పార్టీ నేతలతో ముగిసిన అధ్యాయం అనిపించారు. అంటే.. ఏటు తిరిగి ఏ టర్న్ తీసుకోవాల్సి వచ్చినా.. ఉపయోగపడేలా.. ప్రత్యేకహోదాపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.