ఆంధ్రప్రదేశ్ లో కుల సమీకరణాలపైనే పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణను భాజపా అధ్యక్షుడిగా నియమించారనే అభిప్రాయం చాలామందిలో ఉంది! అయితే, ఆయన నియామకంతో అప్పటికే అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్నవారిలో నిరాశ నెలకొందనేది తెలిసిందే. కన్నాను అధ్యక్షుడిగా ప్రకటించగానే ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెంటనే అలకబూనారు. హరిబాబు కూడా అసంత్రుప్తికి గురయ్యారు. సరే, ఆ తరువాత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలంటే నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలన్న అధిష్టానం ఆదేశానుసారం ఇతర భాజపా నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. అయితే, ఏపీలో భాజపా నేతలు కన్నాకి అండగా ఉంటున్నారా..? లేదంటే, ఆయనది ఒంటరిపోరాటమా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
కన్నా అధ్యక్షుడు అయిన తరువాత ఎంపీ కంభంపాటి హరిబాబు కాస్త జోరు తగ్గించారు. తనను అధ్యక్షుడిగా తప్పించిన దగ్గర్నుంచీ అధిష్టానంపై ఆయన కాస్త గుర్రుగా ఉన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనీ, విశాఖకే పరిమితం అవుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హరిబాబు అనుచరులు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, సీనియర్ నేత కావూరి సాంబశివరావు కూడా ఈ మధ్య మౌనంగానే ఉంటున్నారు. పార్టీలో ఆయన ఉన్నారా అనే అనుమానం కూడా నెలకొంది. ఆయనకి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందే పరిస్థితులు ఉన్నట్టూ తెలుస్తోంది. ఇక, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు పరిస్థితి కూడా అంతే! ఇలా పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకుని సాగే విధంగా కన్నా తీరు ఉండటం లేదన్న విమర్శలు సొంత పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
ఇక, గ్రూపుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజు వర్గం, ఆయనపై గుర్రుతో ఆకుల సత్యనారాయణ వర్గం ఉన్నాయి. ఇక, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా ఇతర నేతలతో సంబంధం లేకుండా సొంత వర్గంతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారట. ఇక, మాజీ రాష్ట్ర మంత్రులు కూడా మౌనంగా ఉండటం కూడా చర్చనీయంగా మారుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత మాణిక్యాలరావు పార్టీ కార్యకలాపాల్లో ఏమంత చురుగ్గా కనిపించడం లేదు. ఇక, కామినేని సంగతి సరేసరి. మంత్రిపదవి నుంచి తప్పుకున్నాక సొంత నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలపై కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయమూ వినిపిస్తోంది.
కేంద్రం చేసిన అభివృద్ధి ప్రచారం చేసుకుంటే చాలు… రాష్ట్రంలో బలపడిపోవచ్చేది భాజపా జాతీయ నేతల ఆలోచన. కానీ, రాష్ట్రంలో సరైన నాయకత్వం పార్టీకి ఉండాలి కదా. ఆ నాయకత్వం కింద పనిచేసేందుకు ఇతర నేతలు కూడా మనస్ఫూర్తిగా సంసిద్ధమై ఉండాలి కదా. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న నేతలందరినీ కన్నా కలుపుకుని వెళ్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నమూ కనిపించడం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భాజపా అధినాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.