బయోపిక్‌లో నటించడం విద్యా బాలన్‌కి కొత్తేమీ కాదు. సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’తో దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశారు. తరవాత ఆమెకు బయోపిక్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ, ఒక్కదానికీ ‘యస్’ చెప్పలేదు. ‘డర్టీ పిక్చర్’ తరవాత విద్యా బాలన్ అంగీకరించిన బయోపిక్ ‘యన్.టి.ఆర్’. దీనికి ఓ విశేషం వుంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ ఇది. తెలుగులో ఆమె డెబ్యూ సినిమా కూడా ఇదే.
ఎన్టీఆర్ తనయుడు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో తండ్రి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిభార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా విద్యా బాలన్ సినిమా గురించి మాట్లాడారు. “ప్రేక్షకులకు, ఎన్టీఆర్‌ని దేవుడిగా కొలిచే ప్రజలకు బసవతారకం గురించి తెలుసు. ఎన్టీఆర్ భార్యగా మాత్రమే తెలుసు. అంతకు మించి ఆమె గురించి తెలియదు. అందుకని నాకు ఆమె పాత్ర ఆసక్తికరంగా అనిపించింది” అని విద్యా బాలన్ పేర్కొన్నారు.
మీకు ఎన్నో బయోపిక్ ఆఫర్స్ వస్తే ఈ సినిమా అంగీకరించడానికి కారణం ఏంటి? అని విద్యా బాలన్‌ని ప్రశ్నిస్తే “ఇది ఎన్టీఆర్ బయోపిక్. బసవతారకం బయోపిక్ కాదు. బసవతారకం ఎన్టీఆర్ కాదుగా. ఆయన జీవితంలో ఎంతో మమేకమైన పాత్ర ఆమెది. అందుకని ఈ సినిమా చేస్తున్నాను” అని తెలిపారు. బుధవారం నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.