తెలుగులో హారర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కి ఓ క్రేజ్, ఓ ఊపు తెచ్చిన సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’. దర్శకుడు మారుతి తీసిన ఆ సినిమా 2013లో వచ్చింది. మరుసటి ఏడాది వచ్చిన ‘గీతాంజలి’ ఆ ట్రెండ్‌ని కంటిన్యూ చేసింది. ఈ రెండిటికి ముందు తర్వాత చాలా హారర్ కామెడీలు వచ్చాయి. ఉదాహరణకు ‘రాజుగారి గది’ వంటివి. అయితే… ‘ప్రేమకథా చిత్రమ్’, ‘గీతాంజలి’ సినిమాలు లో బడ్జెట్లో చక్కగా తీస్తే ఎంతెంత లాభాలు వస్తాయో చూపించాయి. రెండూ ట్రెండ్ సెట్టర్సే.
అంజలి ప్రధానపాత్రలో నటించిన ‘గీతాంజలి’కి రాజ్ కిరణ్ దర్శకుడు. కథ కూడా ఆయనదే. కోన వెంకట్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారు. ఇప్పుడీ సినిమా హిట్ క్రెడిట్ ఎవరిది? అనే అంశం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనికి కారణం సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తన తాజా సినిమా విలేకరుల సమావేశంలో ఇన్ డైరెక్టుగా కోన వెంకట్ మీద విమర్శలు చేశారు. “నా మొదటి సినిమా ‘గీతాంజలి’ క్రెడిట్ తమదే అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారు” అని ‘విశ్వామిత్ర’ ప్రెస్మీట్లో కామెంట్ చేశారు. ‘గీతాంజలి’ తరవాత రాజ్ కిరణ్ తీసిన ‘త్రిపుర’ బాగానే ఆడింది. కానీ, మంచు విష్ణు హీరోగా తీసిన ‘లక్కున్నోడు’ ప్లాపయ్యింది. అదే సమయంలో కోన వెంకట్ వర్క్ చేసిన కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఆయన మాటల్లో ‘గీతాంజలి’ ప్రస్తావన తప్పకుండా వుంటుంది. కోన వెంకట్‌ని, ఆయన మాటలను ఉద్దేశించి రాజ్ కిరణ్ కామెంట్ చేశారని ఇండస్ట్రీ గుసగుస.