ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లను ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేదలకు రూ. 5కే భోజనం అందించే గొప్ప పథకం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ పథకాన్ని ప్రచారం విషయంలో అధికారులు ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదని చెప్పొచ్చు..! అన్న క్యాంటీన్ల ప్రచారంలో భాగంగా భారీ హోర్డిండుగులు, పోస్టర్లను విజయవాడతోపాటు చాలాచోట్ల పెట్టారు. వాటిలో ఒక ముస్లిం, భుజంపై తువ్వాలేసుకున్న మరో వ్యక్తి కలిసి భోజనం చేస్తున్న ఫొటో ఉంటుంది. ఈ ఫొటో చూడ్డానికి బాగానే ఉంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..! విమర్శలకు అవకాశమిస్తోంది. ఇంతకీ.. ఆ ఫొటోలో ఉన్న లోపం ఏంటంటే… ఇది అన్న క్యాంటీన్లో తీసిన ఫొటో కాదు, రాజన్న క్యాంటీన్లో తీసింది..!
2017లో, మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న పేరుతో క్యాంటీన్ ప్రారంభించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటో అది! దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ… 2017, మే 14న తాను రాజన్న క్యాంటీన్ ప్రారంభించాననీ, ఆ సందర్భంగా ఫేస్ బుక్ లో ఈ ఫొటో పెట్టానన్నారు. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాంటీన్ అప్పట్లో ఓపెన్ చేశారు. నాలుగు రూపాయిలకే భోజనం అందించారు. ఆయన చెప్పడం మాత్రమే కాదు… ఆ ఫొటో గతంలో తీసిందే అని చెప్పడానికి దానిపై వాటర్ మార్క్ కూడా ఉంది. మరి, ఈ ఫొటో ఇప్పుడు అన్న క్యాంటీన్ల ప్రచార పోస్టర్లలోకి ఎలా వచ్చిందంటే… మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్‌వారే ప్రచారానికి కావాల్సిన వివరాలూ ఫొటోలూ ఇచ్చారని ఐ అండ్ పీఆర్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అన్న క్యాంటీన్లు అని చెప్పి, రాజన్న క్యాంటీన్ లో భోజనం చేసినవారి ఫొటోతో టీడీపీ ప్రచారం చేసుకుంటోందని సెటైర్లు పడుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించడం ఒకెత్తు అయితే, రాజకీయంగా విమర్శలుపాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే.. ఇదిగో ఇలానే విమర్శలుపాలు కావాల్సి వస్తుంది.
ఈ మధ్యనే, రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఓ ప్రముఖ మీడియా సంస్థ అత్యుత్సాహం ప్రదర్శించి… మార్ఫింగ్ చేసి ఫొటోలు ప్రచురించి పరువు తీసుకుంది! నాడు పూరి ఇల్లు, నేడు సొంతిల్లు అంటూ కొంతమంది ఫొటోలు ప్రచురించి, సోషల్ మీడియాలో విమర్శలపాలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొనక తప్పలేదు.