లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా అనే మీమాంశ అన్ని పార్టీల్లోనూ ఉంది! ఎందుకంటే, ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అలవాటే కదా! కాబట్టి, హఠాత్తుగా లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నాం అనే నిర్ణయం తీసుకున్నా అవాక్కు అవ్వాల్సిన పనిలేదు. దీంతో దాదాపు అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమై ఉంటున్నాయి. అయితే, భాజపాకి ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికలే..! ఈ మూడూ భాజపా పాలిత రాష్ట్రాలు. కావాల్సినంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కాబట్టి, లోక్ సభ కంటే ముందుగా ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే… ఫలితాలు తేడాగా ఉంటే కాంగ్రెస్ మరింత పుంజుకుంటుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని లోక్ సభతో కలిపి జరపడం సాధ్యమా అనే కోణంలో భాజపాలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీఎస్పీలు పొత్తుకు సిద్ధమౌతున్నాయి. ఛత్తీస్ గడ్ లో కూడా అజిత్ జోగిలాంటి నేతల్ని కలుపుకుంటూ, ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాజస్థాన్ లో అయితే కాంగ్రెస్ గెలుపుపై నేతలు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే, ఆ రాష్ట్రంలో భాజపా వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికలే సాక్ష్యం. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వంటి నేతలు స్టార్ కేంపెయినర్లు కాబోతున్నారన్నది కాంగ్రెస్ ధీమా. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనే భయం మోడీ షా ద్వయానికి ఉందనడంలో సందేహం లేదు. ఇక, భాజపాలో కూడా లుకలుకలు చాలానే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ను మార్చాలనేది అమిత్ షా ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే, శివరాజ్ సింగ్ కాస్త స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం షాకి నచ్చడం లేదట! అలాగని, శివరాజ్ సింగ్ కి ప్రాధాన్యత తగ్గిస్తే… భాజపాపై ఆయన అలబూనితే మొత్తానికి మోసం తప్పదేమో అనే భయమూ ఉంది. రాజస్థాన్ లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ వసుంధరా రాజెని మార్చాలని భాజపా అధినాయకత్వానికి ఉన్నా… ధైర్యం చెయ్యలేని పరిస్థితి.
ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే… భాజపాకి ఓటమి తప్పదన్న లెక్కలు ప్రస్తుతం అధినాయత్వం దగ్గరున్నాయి. అలాగని, లోక్ సభ ఎన్నికలతో కలిపి నిర్వహించేస్తే… ఫలితాలు కొంతైనా బాగుంటాయనే అంచనా కూడా ఉంది! కానీ, లోక్ సభ ఎన్నికల్ని ఇష్టం వచ్చినట్టు ముందుకూ వెనక్కే జరిపే పరిస్థితి లేదు. ఇంకోపక్క జాతీయ స్థాయిలో కూడా వ్యతిరేకతను భాజపా డీల్ చేయాల్సి ఉంటుంది కదా! దీంతో ఈ మూడు రాష్ట్రాల విషయమై ఎటూ తేల్చుకోలేని ఒక సందిగ్దంలో మోడీ షా ద్వయం ఉన్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆగస్టు 15 సందర్భంగా కొన్ని సంచలన నిర్ణయాలు మోడీ ప్రకటిస్తారనే లీకులు కూడా ఇస్తున్నారు. ఆ సంచలనాల్లో ఎన్నికల నిర్ణయాలూ ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది.