రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీకి మద్దతివ్వబోమని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈ సమయంలో మూడు అంశాలను ఆ పార్టీ ప్రకటించింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వని కారణంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్నామన్నారు. రెండోది.. పార్లమెంట్ వెలుపల తమ రాజ్యసభ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తారన్నారు. మూడోది వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుచుని.. ప్రత్యేకహోదా ఇచ్చే వారికే ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తామన్నారు.
ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని బీజేపీ ఎప్పుడో ప్రకటించింది కదా..!?
మొదటి దాన్ని చూస్తే… ప్రత్యేకహోదా ఇవ్వనందుకు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వమనడం కాదు.. వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది. అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కనుక..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ కు ఓటు వేస్తుందా..? . సహజంగా రాజ్యాంగ పదవులకు మేము పోటీ కోరుకోము అని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు… మీడియాకు చెప్పారు. కానీ బీజేపీ ఏపీకి అన్యాయం చేసింది కాబట్టి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు. విచిత్రం ఏమిటంటే… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో … ఇదే కారణం చెప్పింది. రాజ్యాంగ పదవులకు మేము పోటీ కోరుకోము కనుక.. . రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తామన్నారు. పోటీ జరగకపోతే వేరే విషయం. కానీ పోటీ జరిగితే మాత్రం.. అభ్యర్థులు రంగంలో ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అదే జరిగింది. వైసీపీ మాత్రం బీజేపీకే ఓటు వేసింది. అప్పుడు వైసీపీ ఓటు వేసినా వేయకపోయినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తారు. అంటే రాజ్యాంగ పదవులకు పోటీ కోరుకోమన్నారు.. కానీ పోటీ జరిగితే బీజేపీకి ఓటేశారు.
ఇంత కాలం మోడీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు..?
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ లాజిక్ ఉంటుందో.. అదే లాజిక్ రాష్ట్రపతి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ ఉంటుంది. ప్రత్యేకహోదా నిరాకరించినందుకు ఓటు వేయం అంటున్నారు. నిజానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే పార్లమెంట్ కు కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలోనే… ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి.. వ్యతిరేకంగా ఓటు వేస్తామంటున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ముఖ్యమా..? పార్లమెంట్ లో చేసిన ప్రకటన ముఖ్యమా..?. వ్యతిరేకించేవాళ్లయితే అప్పుడే వ్యతిరేకించావారు. కానీ అప్పటికి ఇప్పటికి వైఖరి మారింది. గత నాలుగేళ్ల కాలంలో బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతు ప్రకటించింది. మోదీకి వ్యతిరేకంగా.. ఏ ఒక్క సమావేశంలోనూ పాల్గొనలేదు. కర్ణాటక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీని ఓడించాలని పిలుపునిస్తే.. వైసీపీ స్పందించలేదు. జగన్ అలాంటి ప్రకటన చేయలేదు.
బీజేపీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరించారు..?
ఇప్పటి వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సానుకూల వైఖరి తీసుకుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఓ రకంగ రాజకీయంగా దాడి చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. బీజేపీతో కలిసి ఉన్నామని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడకుండా ఉండేందుకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించారు. గతంలో ఎందుకు చేయలేదన్నది అందరికీ తెలిసిందే. రెండోది లోక్ సభ ఎంపీలు రాజీనామాలు చేశారు. ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేశామన్నారు. ప్రత్యేకహోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత ఎంపీలు ఇప్పటి వరకు చేసిన పోరాటమేంటి..?. ఏమీ చేయలేదు. పార్లమెంట్ నుంచి వెళ్లిపోయి ఆందోళన చేస్తామన్నారు. చేయలేదు. రాజీనామాలు చేయడం వల్ల.. పార్లమెంట్ లోపల పోరాడే అవకాశాన్ని కూడా కోల్పోయారు. రాజీనామాల ఎత్తుగడ ఫలించలేదు.
25 ఎంపీ సీట్లు వస్తే ప్రత్యేకహోదా ఎలా తెస్తారు..?
ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తే.. ప్రత్యేకహోదా తెస్తామన్నారు. ఇప్పుడున్న 25 మంది ఎంపీల్లో ఇద్దరు బీజేపీ సభ్యులు మినహా.. అందరూ ప్రత్యేకహోదా కోరుకునేవారే. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారే మరి ఎందుకు ప్రత్యేకహోదా రాలేదు..?. మరి 25 సీట్లు వస్తే ప్రత్యేకహోదాను వైసీపీ ఎలా తెస్తుంది..?. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకుంటే.. వైసీపీ 25 ఎంపీ సీట్లు గెలుచుకున్నా ప్రత్యేకహోదా రాదు. ఇప్పుడున్న పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఏం చేయాలంటే.. తమ పార్టీకి 25 సీట్లు తెచ్చుకునే ప్రయత్నంతో పాటు.. కేంద్రంలో ఎన్డీఏకు సీట్లు తగ్గేలా కృషి చేయాలి. ఏపీ ఎంపీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నిలబడాలి. అప్పుడే ప్రత్యేకహోదా అంశం పరిశీలనకు వస్తుంది. కానీ ఎన్డీఏ బలహీనపడటానికి ఎలాంటి పని వైసీపీ చేయదు.
టీడీపీ ప్రచారాన్ని ఆపడానికే..!?
ఇంత స్పష్టంగా ఉన్నా.. వైసీపీ ఇప్పుడు.. హఠాత్తుగా.. ఎందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తోందంటే… బీజేపీతో కుమ్మక్కయారన్న విషయాన్ని చంద్రబాబు చాలా దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది నిజం కాదు అని నమ్మించడానికే.. ఈ నిర్ణయం తీసుకున్నారు.