శ్రీవారి ఆలయంలో జరగనున్న మహాసంప్రోక్షణ సమయంలో భక్తుల దర్శనాలను నిలిపివేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని రాజకీయం చేయడం ప్రారంభమయింది. వచ్చే నెల 12 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించేందుకు హమహాసంప్రోక్షణ జరగనుంది. మహా సంప్రోక్షణ సమయంలో 6 రోజులపాటు భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ చరిత్రలో… భక్తులకు దర్శనాన్ని నిలిపివేసి మహాసంప్రోక్షణ చేయడం ఇదే తొలిసారి. కొద్ది రోజులుగా .. టీటీడీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వారు దీన్నో ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తిరుమల కొండపైనే వివాదాస్పద ప్రకటన చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…రమణదీక్షితులు చెప్పిన మాటలు నిజమవుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసే అధికారం టీటీడీ పాలకమండలికి లేదన్నారు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే భక్తులతో కలసి ఉద్యమిస్తామమని ప్రకటించేశారు.
కలియుగ వైకుంఠనాథుడైన తిరుమల శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలన్నింటినీ వెయ్యేళ్ల కిందట రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా ఆగమోక్తంగా నిర్వహిస్తోంది టీటీడీ. ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాసంప్రోక్షణ అంటే.. ఆలయంలో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయడం. శ్రీవారి గర్బాలయంలో చెయ్యవలసిన మరమ్మతు పనులు చాలా తక్కువే కాబట్టి… మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించాలని ఆగమ పండితులు నిర్ణయించారు. మరమ్మతుల కోసం గర్భగుడిలోకి ఎవరూ వెళ్లరు. అర్చకులు మాత్రమే… ఆ పనులు చేస్తారు. ఇదందా తెలిసి కూడా.. రోజా రాజకీయం ప్రారంభించేశారు. ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాత్రం కాస్త ఆచితూచి స్పందించారు. ప్రభుత్వం మీద తోసేయడానికి సాదాసీదా ఇష్యూ కాదు కాబట్టి సంయమనం పాటించారు. తనకు పూర్తి వివరాలు తెలియదని తెలుసుకున్న తర్వాత మాట్లాడతానన్నారు.
వాస్తవానికి మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు ఇరవై వేల మంది భక్తులకు మాత్రమే.. దర్శనం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం కొండపైకి ప్రతీ రోజూ.. దాదాపుగా లక్ష మంది వస్తున్నారు. ఇరవై వేల మంది దర్శనం చేసుకుంటే.. 80 వేల మంది క్యూలైన్లలో ఉండిపోయారు. అలా ఆరు రోజుల పాటు అంటే..నాలుగు లక్షల మందికిపైగా భక్తులు క్యూలైన్లలో ఉండిపోతారు. దీని వల్ల మరిన్ని ఇబ్బందులొస్తాయని దర్శనాలు నిలిపివేశారు. కొద్ది రోజులుగా.. శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు.. రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో.. టీటీడీ చూట్టూ రాజకీయం ముసురుకుంది. ఇప్పుడు కొత్తగా… మహాసంప్రోక్షణ విషయంలోనూ ఇలాంటి వివాదమే లెవనెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.