త్యాగం వల్ల సానుభూతి వస్తుంది, పోరాటం వల్ల ఫలితం వస్తుంది. ఈ చిన్న తేడా ప్రతిపక్ష పార్టీ వైకాపాకి అర్థం కావడం లేదు. ఇక, విషయానికొస్తే… వైకాపాకు చెందిన పత్రిక ‘సాక్షి’ మళ్లీ మొదలుపెట్టేసింది! రాష్ట్ర ప్రయోజనాల కోసం వైకాపా ఎంపీలు త్యాగాలు చేశారనీ, గత పార్లమెంటు సమావేశాల్లోకే కేంద్రానికి ఇచ్చిన గడువు పూర్తి కావడంతో, ఏడాదిపాటు అవకాశం ఉన్నా పదవుల్ని తృణప్రాయంగా త్యాగాలు చేశారని ఓ కథనంలో మళ్లీ పేర్కొన్నారు. ఆ సమయంలోనే, టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని జగన్ పదేపదే పిలుపునిచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు చెవికెక్కలేదని మరోసారి వాపోయారు. హోదాపై నాలుగేళ్లుగా టీడీపీ చేస్తున్న ప్రయత్నం వంచనేననీ, ఇప్పుడు మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తోందనీ, ఇంకోపక్క కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేలా ఒక్కో అడుగూ నెమ్మదిగా వేస్తోందంటూ ఓ విశ్లేషణ చేశారు.
ఇంతకీ, ‘సాక్షి’ బాధ ఏంటంటే… వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు, భాజపా సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ చేసుకుంటున్న తాజా ఏర్పాట్లు..! ఈసారి సభ ప్రారంభానికి ముందుగానే ఏపీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి, జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత పార్లమెంటు సెషన్స్ కంటే ఈసారి సమావేశాలు మరింత వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా వైకాపా చేయగలిగింది ఏమీ లేదు…! ఎందుకంటే, ఎంపీలు రాజీనామాలు చేసేశారు కదా. సభలో వారి ప్రాతినిధ్యమేదీ..? ఎంపీల త్యాగాలు అనే కాన్సెప్ట్ విజయసాయిరెడ్డికి వర్తించదు కనుక… ఆయన మరోసారి ఢిల్లీలో మీడియా ముందు టీడీపీని విమర్శిస్తూ కనిపించడమే తప్ప, ఈసారి సమావేశాల్లో వారు చేయగలిదేం లేదు.
ఇదంతా తాము చేసిన త్యాగం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ, అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే, ఉప ఎన్నికలకు వెళ్లుంటే ఆ అభిప్రాయం కలిగేదేమో. కానీ, వాటినీ రానివ్వని పరిస్థితుల్లో చాలా కంఫర్టబుల్ గా రాజీనామాలు ఆమోదింపజేసుకున్నారు. ఈ క్రమమంతా ప్రజలకు అర్థం కావడంతో… ప్రత్యేక హోదా కోసమో, ఆంధ్రా ప్రయోజనాల కోసమో వైకాపా ఎంపీలు చేసిన పదవీ త్యాగాలు చారిత్రకమనే ఇమేజ్ బిల్డ్ కాలేదు! రాజీనామాలు చేసి ఏం సాధించారనే ప్రశ్నకూ జగన్ నుంచి సరైన వివరణ లేకపోవడంతో… వారు మాత్రమే అనుకుంటున్న త్యాగాల మీనింగ్, ప్రజలకు కన్వే కాలేదు.
అయితే, ప్రజా ప్రతినిధులు చేయాల్సినవి త్యాగాలు కాదు… పోరాటాలు! ప్రజాక్షేత్రంలో పోరాటాలకే విలువ ఉంటుంది. పోరాటాలే ఏనాటికైనా ఫలితాలను రాబట్టగలవు. పోరాటాలు మాత్రమే ప్రజల గొంతును వినిపించగలవు. అంతేగానీ… చట్ట సభలకు హాజరు కాకపోవడం, ‘పోరాడండీ’ అంటూ ప్రజలు ఇచ్చిన బాధ్యతల నుంచీ తప్పుకోవడం పోరాటం ఎలా అవుతుంది..? రాష్ట్ర ప్రయోజనాల అంశమై వైకాపా చేసిన పోరాటం ఎంపీల రాజీనామాలతోనే ఢిల్లీలో చతికిలపడిపోయింది. ఆ విషయం వారికీ తెలుసు కాబట్టే… ఇప్పుడు మరోసారి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టే కథనాలు వండటం మొదలుపెట్టేసింది సాక్షి! చంద్రబాబు మళ్లీ వంచిస్తున్నారనీ, కాంగ్రెస్ కు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ కొత్తగా ఓ వాదన ఎత్తుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోణాన్ని సాక్షి వదిలేస్తోందనేది ప్రజలు గమనిస్తున్న అంశం. తాజా ప్రయత్నం ద్వారా పరోక్షంగా వైకాపా ఎవరికి మద్దతు ఇస్తోందీ, ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందనేది ప్రత్యేకంగా విశ్లేషించుకోవాల్సిన పనిలేదు.