మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 11వ తేదీ నుంచి.. 16వ తేదీ వరకు.. భక్తుల దర్శనాలు నిలిపివేయాలన్న టీటీడీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. అవకాశం ఉన్నంత వరకు భక్తులను దర్శనాలకు అనుమతించాలని ఆదేశించారు. రోజుల తరబడిభక్తులను దర్శనానికి ఎదురుచూసేలా చేయవద్దని టీటీడీకి సూచించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలు అనుసరించాలని ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు కొండపైకి శ్రీవారి దర్శనానికి రోజుకు దాదాపుగా లక్ష మంది వస్తున్నారని..సంప్రోక్షణ సమయంలో.. శ్రీవారి దర్శనానికి రోజుకు కేవలం ఇరవ వేల మందిని మాత్రమే అనుమతించే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లక్ష మందికి వస్తే…20 వేల మంది దర్శనం చేసుకుంటే మిగతా 80 వేల మంది కొండపై ఉండిపోతారని.. ఇలా ఆరు రోజుల పాటు జరిగితే.. నాలుగైదు, లక్షల మంది కొండపై ఉంటారు. అదే జరిగితే .. గందరగోళం ఏర్పడుతుందన్న కారణంగా.. దర్శనాలను నిలిపివేయాలని టీటీడీ భావించింది.
టీటీడీ నిర్ణయంపై వెంటనే రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ఎప్పుడూ ముందుండే కొంత మంది స్వామిజీలు కూడా… టీటీడీ నిర్ణయాన్ని ఖండించారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి అంటగట్టేలా విమర్శలు ప్రారంభించారు. దీంతో చంద్రబాబు దర్శనాలను కొనసాగించాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాసంప్రోక్షణ అంటే.. ఆలయంలో ఏమైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేయడం. శ్రీవారి గర్బాలయంలో చెయ్యవలసిన మరమ్మతు పనులు చాలా తక్కువే కాబట్టి… మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించాలని ఆగమ పండితులు నిర్ణయించారు.
మరమ్మతుల కోసం గర్భగుడిలోకి ఎవరూ వెళ్లరు. అర్చకులు మాత్రమే… ఆ పనులు చేస్తారు. శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు.. రమణదీక్షితులు చేసిన ఆరోపణలతో.. టీటీడీ చూట్టూ రాజకీయం ముసురుకుంది. ఇప్పుడు కొత్తగా… మహాసంప్రోక్షణ విషయంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తే అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు త్వరితంగా చర్యలు తీసుకున్నారు.