ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా తీరులో గత కొద్దిరోజులుగా కనిపిస్తున్న గణనీయమైన మార్పు ఇది..! అదేంటంటే… భారతీయ జనతా పార్టీని విమర్శించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే, సందర్భాలను దొరకబుచ్చుకునిమరీ విమర్శలు చేస్తున్నారు. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు. ఢిల్లీలో జరిగిన అఖిల పక్షానికి వైకాపా ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకను ఆహ్వానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రేణుకపై అనర్హత పిటీషన్ పెండింగ్ లో ఉందనీ, ఆమెని ఎలా ఆహ్వానిస్తారంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ ను నిలదీశాననీ, ఆ సమయంలో ఇతర పార్టీలు కూడా తనకు మద్దతుగా నిలిచాయని విజయసాయి చెప్పారు. ఫిరాయింపు ఎంపీల్ని అఖిల పక్షానికి పిలవడం నీతి బాహ్యమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు.
భాజపా, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఇది మరో సాక్ష్యమన్నారు. ఇతర ఫిరాయింపు ఎంపీలు కూడా ఏపీలో ఉండగా, ఎందుకు బుట్టా రేణుకను మాత్రమే పిలిచారంటూ ప్రశ్నించారు. విభజన హామీలను యథాతథంగా అమలు చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనీ, జాతీయ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాల్సిన అవసరం ఏముందని విజయసాయి మండిపడ్డారు! ఇదే అంశమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రైల్వేజోన్ అనేది విభజన చట్టంలోని అంశమేననీ, అయినాసరే భాజపా అమలు చేసిన పరిస్థితి లేదని అన్నారు. ఇవన్నీ ప్రధాని దృష్టికి తాము తీసుకెళ్తే… చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. అఖిల పక్షంలో ప్రజల సమస్యలను టీడీపీ నేతలు మాట్లాడటం లేదనీ, తాము ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రత్యేక హోదాకి బదులు ప్యాకేజీ కేంద్రం ఇస్తామంటే నాడు ఒప్పుకున్నారనీ, అందుకే ఇప్పుడు భాజపా ఆ అంశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటోందన్నారు.
వైకాపాలో స్పష్టంగా కనిపిస్తున్న మార్పు ఏంటంటే… టీడీపీ, భాజపాలను ఒకే గాటన కట్టి విమర్శలు చేయడం. రెండు పార్టీల మధ్య కుమ్మక్కు అంటున్నారు విజయసాయి. రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నిక అంశంలో కూడా భాజపాకి వ్యతిరేకంగానే వ్యవహరిస్తామని వైకాపా నిర్ణయించింది. ఈ మార్పునకు బలమైన కారణమూ ఉంది. ఆంధ్రా ప్రజల్లో బలంగా ఏర్పడుతున్న ఒక స్థాయి నమ్మకం ఏంటంటే… భాజపా, వైకాపా కలిసి టీడీపీని విమర్శిస్తున్నాయనేది! భాజపాతో వైకాపా అంటకాగుతోందన్న ఇమేజ్.. వచ్చే ఎన్నికల్లో వైకాపాకి ఏమాత్రం కలిసిరాని అంశం అవుతుందని వారికీ తెలుసు. అందుకే, తమపై అలాంటి ముద్ర పడకుండా ఉండాలనే ఆతృత ఈ మధ్య వైకాపాలో పెరిగింది. దీంతో, సందర్భాలని దొరకబుచ్చుకుని మరీ విమర్శలకు ప్రయత్నిస్తోంది. పోనీ, ఆ విమర్శలు కూడా ఎంత తీవ్రంగా ఉంటున్నాయనేది విజయసాయి మాటలు గమనిస్తే అర్థమైపోతుంది..!
రైల్వేజోన్ పైగానీ, ప్రత్యేక హోదాపైగానీ, ఇతర విభజన హామీలపైగానీ భాజపాపై నేరుగా వైకాపా ఏనాడైనా పోరాటం చేసిందా..? గత పార్లమెంటు సమావేశాల్లో ఇవే అంశాలపై అట్టుడికిపోతున్నా… పార్లమెంటు బయట ఏపీ సర్కారును విమర్శించేందుకు మాత్రమే విజసాయి రెడ్డి పరిమితమయ్యారు. ప్రధాని కార్యాలయంలో కూర్చుని ఏవేవో మంత్రాంగాలు సాగించారు. అలాంటివారు ఇవాళ్ల కేంద్రాన్ని నిలదీశాం, ఏపీకి భాజపా ఏమీ చెయ్యలేదు, భాజపాది నీతి బాహ్య రాజకీయం అని విమర్శిస్తే కొత్తగా ఉంది.