పార్లమెంట్ సమావేశాల అజెండా ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి బుట్టా రేణుకను.. వైసీపీ లోక్‌సభ పక్ష నేతగా ఆహ్వానించడం… ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఓ మాదిరి సంచలనమే కలిగించిందని చెప్పాలి. బుట్టా రేణుక అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోలేదు. కానీ.. ఆమె అనధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుకే… వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ ఆమెపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ వద్ద ఓ పిటిషన్ దాఖలు చేసుకుంది. కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ లోపు.. వైసీపీలో కొనసాగుతున్న ఐదుగురు వైసీపీ లోక్‌సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఉపఎన్నికలు రాని తేదీని చూసుకుని ఆమోదింపచేసుకున్నారు. దాంతోనే వైసీపీకి కొత్త చిక్కులు వచ్చి పడినట్లయింది.
లోక్‌సభ రికార్డుల ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఇంకా ఉన్నారు. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక..లోక్‌సభ రికార్డుల ప్రకారం వైసీపీ ఎంపీలే. అందుకే లోక్‌సభలో ఆ పార్టీ తరపున.. బుట్టా రేణుకకు పార్లమెంట్ అధికారులు ఆహ్వానం పంపారు. అఖిలపక్ష సమావేశంలో… బుట్టా రేణుక.. వైఎస్‌ఆర్ సీపీ అనే పేరు ఉండటంతో.. విజయసాయిరెడ్డి షాక్‌గు గురయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ వద్దకు వెళ్లి… ఆమె టీడీపీలో చేరిందని .. అనర్హతా పిటిషన్ స్పీకర్ వద్ద ఉందని.. ఆమెను బయటకు పంపాలని కోరారు. కానీ అనంతకుమార్… స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉందని చెప్పడంతో.. ఏమీ చేయలేక.. బయటకు వచ్చి మీడియా ముందు.. అంతా టీడీపీనే చేసిందని విమర్శుల చేసుకొచ్చారు.
నిజానికికి కేంద్రంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేకపోయింది. బీజేపీ పెద్దలు తమ పట్ల సానుభూతితో ఉంటారని… తెలుగుదేశం పార్టీ దూరం అయింది కాబట్టి.. ఏపీలో ఇక తాము తప్ప వేరే ఆప్షన్ లేదు కనుక… సహకరిస్తారని ఆశ పడుతున్నారు. కానీ అనూహ్యంగా.. బీజేపీ వైసీపీకి షాక్ ఇచ్చేందుకు వెనుకాడలేదు. దీనికి కారణం.. కొద్ది రోజులుగా.. బీజేపీకి వ్యతిరేకంగా… వైసీపీ చేస్తున్న ప్రకటనలేనన్న అభిప్రాయాలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉండదని..జగన్ మినహా.. ఆ పార్టీ నేతలు అందరూ ప్రకటిస్తున్నారు. అదే సమయంలో… రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించడం కూడా దీనికి ఓ కారణంగా అంచనాలున్నాయి. మద్దతివ్వబోము అని చెప్పడం వేరు.. వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పడం వేరని బీజేపీ వర్గాలు విశ్లేషించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజాగ్రహం భయంతో… బీజేపీని దూరం పెట్టినట్లు కనిపిద్దామని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు… ఆ పార్టీకి షాక్ ఇస్తున్నాయని అంతిమంగా… ఢిల్లీలో జరుగుతున్న ప్రచారం.