ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ… గత మూడు రోజులుగా ఢిల్లీలో పలువుర్ని కేంద్రమంత్రుల్ని కలిశారు. అందులో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జమ్మూ-కశ్మీర్లాంటి పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. తాము పార్టీ కార్యక్రమాల కోసం ఎక్కడికి వెళ్తే.. అక్కడ అడ్డుకుంటున్నారని… ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ఇంకా తీవ్రమైన విషయాలు ఏమైనా ఉన్నాయో లేవో కానీ… ఏపీలో ఏం జరుగుతుందో..తెలుసుకోవాలని ఇంటలిజెన్స్ అధికారులను పురమాయిస్తానని.. రాజ్నాథ్ చెప్పినట్లు.. కన్నా… ప్రచారం చేసుకుంటున్నారు.
నిజానికి కొద్ది రోజులుగా ఏపీలో శాంతిభద్రతలపై బీజేపీ చాలా హడావుడి చేస్తోంది. ఏమీ జరగకుండానే.. ఏదో జరిగిపోతున్నట్లు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ వద్దకు వెళ్లారు. బీజేపీ నేతలు జిల్లాకు వెళ్లినప్పుడు ప్రతిఘటన ఎదురవుతోంది. కావలిలో ఓ వ్యక్తి కన్నాపై చెప్పు విసిరాడు. ఒంగోలులో మరో వ్యక్తి ప్రత్యేకహోదా ప్లకార్డు ప్రదర్శించారు. వారిద్దర్నీ బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. వారిపై కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురంలో బీజేపీ, టీడీపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. రాజకీయాల్లో ఇలాంటివి చాలా సాధారణంగా జరుగుతూంటాయి. విభజన హామీల అమలు విషయంలో బీజేపీ మోసం చేసిందనే సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉండటం ఈ ఘటనలు జరగడానికి ఓ బలమైన కారణం. పైగా ఇవన్నీ బీజేపీ నేతల దూకుడు వల్లే వివాదాస్పదంగా మారాయి. అయినా రాష్ట్రపతి పాలన అనే పదాన్ని తరచుగా వాడేస్తున్నారు బీజేపీ నేతలు.
ఏపీ శాంతిభద్రతల పరిస్థితిపై కన్నా కేంద్రానికి ఫిర్యాదు చేసి..తిరిగి రాక ముందే..ఆయన ఢిల్లీలో ఉండగానే.. జార్ఖండ్లో ఓ ఘటన జరిగింది. ప్రముఖ సామాజిక కార్యకర్త.. స్వామి అగ్నివేష్ను… జార్ఖండ్లో బీజేపీ యువమోర్చా కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు వెంటపడి కొట్టారు. పెద్ద వయసు వ్యక్తి అని చూడకుండా.. వెంటపడి వెంటాడారు. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తోంది. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. స్వామి అగ్నివేష్ను కొట్టింది బీజేపీ కార్యకర్తలు. ఆ ఘటనతో పోలిస్తే.. ఏపీలో ఏం జరిగింది..? మరి ఏపీతో పోలిస్తే.. జార్ఖండ్ బెటరా..?. నిజంగా కన్నాకే అలాంటి పరిస్థితి ఎదురయి ఉంటే.. బీజేపీ నేతలు ఏం చేసి ఉండేవారు..?