తిరుమల వేంకటేశ్వరుని దర్శనాలు ఆపేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కావచ్చు, బోర్డు కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలపోటుగా మారుతున్నాయి. రమణదీక్షితులు విషయంలో తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని తిరుమల విషయాలు అనేకం రచ్చకెక్కాయి. అడుగు ముందుకు వేసిన తరువాత వెనక్కు తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి, తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అనేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
అంత మాత్రం చేత ఆ విషయం, ఆ వైనం సద్దు మణిగిపోలేదు. నగల విషయంలో కూడా టీటీడీ బోర్డు ఇలాగే వ్యవహరించింది. దేవుడి నగలు ప్రదర్శించడం ఆగమవిధానం కాదు అని, జనాలకు చూపించకూడదు అంది. మరి దేవుడికి అలంకరించిన తరువాత అయినా జనాలు చూస్తారు కదా? పోనీ విగ్రహం మీద వున్నపుడే చూడాలి అని ఆగమశాస్త్ర పద్దతి అని సర్దిచెప్పుకోవచ్చు. మరి అలాంటపుడు టీటీడీ సభ్యులు ఎందుకు చూడాలి? వాళ్లు సామాన్య మానవులు కాదా?
ఇలా ప్రతీదీ అవకతవగా చేస్తూ, దాని ఫలితం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంటుకునేలా చేయడం టీటీడీ బోర్డుకు పరిపాటి అయింది. అలాంటి నేపథ్యంలో కొన్ని రోజుల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేసేంత కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంటే ఏమనుకోవాలి? మెడ మీద తలకాయ వున్నవాళ్లు ఆలోచించే విధానమేనా ఇది?
గతంలో ఎప్పుడూ ఇలా ఆలయం మూసి వేయడం జరగలేదు. కేవలం అతి కొద్ది మందో, పదుల మందో మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారు. సిసి కెమేరాలు కూడా ఆపు చేస్తారు.
ఇలాంటి నిర్ణయాలు భక్తులకు ఏం విషయాలను చేరవేస్తాయి? భక్తుల సంగతి అలా వుంచితే, అదనుకోసం వేచి వున్న బాబు వ్యతిరేక శక్తులకు ఏం ఆయుధాలు అందిస్తాయి? ఎవరికీ ఏమీ తెలియకుండా తిరుమలలో ఏదో చేసేస్తున్నారు అన్న కలరింగ్ అయితే వస్తుంది కదా?
ఈమాత్రం ముందుగా టీటీడీ బోర్డు ఎందుకు ఊహించలేకపోయింది?
అసలే దుర్గ గుడిలో పూజలు ముఖ్యమంత్రి కుటుంబానికి చుట్టే ప్రయత్నం జరిగింది. కానీ ఏదో మొత్తానికి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే దాచగలిగారు. ఇప్పుడు తిరుమల గుడిలో కూడా ఏదో చేసారనో, చేస్తున్నారనో బయటకు హడావుడి సృష్టిస్తే..హిందూ జనాల సెంటిమెంట్ అంతా ఏమవుతుంది. అది బాబుకు వ్యతిరేకంగా మారితే ఫలితం ఏమిటి?
టీటీడీ బోర్డు ఈ మాత్రం ఎందుకు ఆలోచించలేకపోయింది. సమయానికి చంద్రబాబు కలుగచేసుకుని, పరిమిత సంఖ్యలో అయినా భక్తులను అనుమతించమని ఆదేశించారు కాబట్టి, ఇది కొంత సర్దు మణిగే అవకాశం వుంది. లేదూ అంటే బోర్డు చేసిన దానికి బాబు మూల్యం చెల్లించాల్సి వచ్చేది.