వచ్చే ఎన్నికల్లో 2004 నాటి అనుభవమే తెలుగుదేశం పార్టీకి ఎదురుకాబోతోందని ప్రతిపక్ష వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ పార్టీకి 40 సీట్లకు మించి రానివ్వమన్నారు! వచ్చే ఎన్నికల్లో వైకాపా ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చాలా విషయాలు మాట్లాడారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ మోసపోయారని జగన్ అన్నారు. మానవ తప్పిదాల వల్లనే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పంటకీ గిట్టుబాటు ధర లేదని రైతులు తన దగ్గర వాపోతున్నారనీ, వైయస్సార్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయనీ, రోడ్ల మీదకు వెళ్లాలంటే సామాన్యులు భయపడే పరిస్థితి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తంగా నీరుగార్చారనీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని కూడా సక్రమంగా అమలుచేయడం లేదని జగన్ ఆరోపించారు. రాజధాని అమరావతిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం జరగలేదన్నారు. గత ఎన్నికల్లో కేవలం అబద్ధాలు చెప్పి చంద్రబాబు గెలిచారనీ, ఇంకోపక్క నరేంద్ర మోడీ హవా, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ప్రచారం వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదనీ… పవన్ కల్యాణ్ సొంతంగా పోటీకి దిగుతున్నా చీలిపోయేవి టీడీపీ ఓట్లు మాత్రమేనని, తమ ఓటు బ్యాంకు తమకే ఉంటుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈరోజున ప్రత్యేక హోదా గురించి అందరూ మాట్లాడుతున్నారంటే కారణం… వైకాపా చేసిన పోరాట ఫలితమే అన్నారు జగన్! ఈ పోరాటంలో బాగంగా తమ చివరి అస్త్రంగా పదవులకు రాజీనామాలు చేసి, కేంద్రం ముఖాన కొట్టబట్టే ఇవాళ్ల హోదా అనేది లైవ్ లో ఉందన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా లేదన్నది సరికాదనీ… ఎన్నికల కోడ్ ఆర్నెల్ల ముందు వరకూ కూడా ఎన్నికలు నిర్వహించొచ్చని జగన్ చెప్పారు!!
తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తాననీ, దేశంలోనే ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానని జగన్ చెప్పారు. తన మీద అవినీతి అంటూ ఆరోపణలు చేసేవారు, ఒక్కసారి ఆత్మసాక్షిని అడిగి మాట్లాడాలన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తాను రాష్ట్రంలోనే లేననీ, తాను ఏ పదవిలోనూ లేననీ, అలాంటప్పుడు అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు? లక్ష కోట్ల అవినీతి అంటూ తనపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేయడం చాలా ఈజీ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే నాయకుడి ఇమేజ్ మీద ఆధారపడి ఉంటాయనీ, తన ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను కాబట్టి, వైకాపాలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఏకవ్యక్తి పార్టీ అంటూ వస్తున్న విమర్శలు సరికావనీ, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటానని జగన్ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమనే ధీమా జగన్ లో వ్యక్తమౌతోంది. ఇదే సమయంలో జనసేన, భాజపాలు తమకు పూర్తిగా అవసరం లేదన్న ముక్కుసూటి సమాధానం జగన్ నుంచి ఈ సందర్భంలో రాలేదు! గత ఎన్నికల ఓటమి తరువాత… చంద్రబాబు అబద్ధపు హామీల వల్లనే టీడీపీ గెలిచిందనే విశ్లేషణ చేసుకున్నట్టున్నారుగానీ, వైకాపా తప్పిదాలపై విఫులంగా విశ్లేషించుకున్నామనే మాట కూడా జగన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయారు. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి భాజపాని తాను ఎప్పుడూ ఉపేక్షించలేదని జగన్ చెబుతూనే… ఆయన గుర్తు చేసిన సందర్భాలన్నీ చంద్రబాబును విమర్శించినవే కావడం గమనార్హం.