మొత్తానికి ఒక సినిమా హీరోకు రాజకీయాలంటే మొహం మొత్తింది. తనజీవితంలో ఇక సినిమా కెరీర్ చాలనుకుని రాజకీయాలవైపు వెళ్లి.. రాష్ట్ర విభజన సమయం నుంచి కూడా చాలా ముమ్మరంగా రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చిన ఒక యువహీరో.. అక్కడ తాను చేయగలిగింది ఏమీ లేదని అర్థంచేసుకున్నాడు. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా తిరిగి సినిమా పరిశ్రమలోకే వచ్చి పడ్డాడు. ఇక సినిమాలు చేయకూడదనుకున్న ఆ హీరో.. ఇప్పుడు నెగటివ్ రోల్స్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ బ్రీఫింగ్ అంతా ఎవరి గురించా? అనుకుంటున్నారా? మొన్నటి హీరో, నిన్నటి భాజపా నాయకుడు శివాజీ గురించి!
రాష్ట్ర విభజనకు సంబందించిన ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే ఇంచుమించుగా శివాజీ సినిమా ఇండస్ట్రీనుంచి రాజకీయాల వైపు అడుగుపెట్టాడు. అప్పట్లో మోడీ హవా దేశవ్యాప్తంగా బీభత్సంగా కనిపిస్తూ ఉన్న సమయంలో శివాజీ కూడా ఆటోమేటిగ్గా భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశించాడు. ఆ పార్టీలో ఉంటూ చాలా పెద్దస్థాయిలో సమైక్యాంధ్ర గళం వినిపించాడు. ఫలితం కనిపించలేదు.
భాజపా తరఫున ఎన్నికల్లో తీవ్రస్థాయిలో ప్రచారం కూడా నిర్వహించాడు కానీ, ఆయన ప్రచారానికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ పార్టీ తరఫునే పవన్‌కల్యాణ్ లాంటి పెద్దస్టార్ ప్రచారంలో ఉండడంతో శివాజీ ప్రచారానికి విలువ దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలంటూ శివాజీ ఉధృతంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాడు. కానీ.. పాపం, ఆయన సొంత పార్టీ భాజపా కూడా ఆయన దీక్ష గురించి పట్టించుకోలేదు. ఇలా రాజకీయ రంగంలో తాను ఏం చేయదలచుకున్నా.. ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఏతావతా.. అక్కడ ఆయనను పట్టించుకునే వారే లేకుండాపోయారు.
ఈలోగా సినిమా కెరీర్ కూడా మంటగలిసిపోయింది. తీరా ఇప్పుడు ‘షి’ అనే చిత్రం ద్వారా శివాజీ ఒక నెగటివ్ పాత్ర చేస్తూ రీఎంట్రీ ఇస్తున్నాడు. రెండున్నరేళ్లు సినిమాలకు దూరం అయినందుకు దాదాపుగా విచారిస్తున్నట్లుగా శివాజీ ఈ చిత్రం ప్రెస్మీట్లో మాట్లాడడం విశేషం. రాజకీయాలు సమాజం కోసం కాదు… వ్యక్తుల కోసం ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడానికి తన జీవితంలో రెండున్నరేళ్లు వృథా అయ్యాయంటూ … శివాజీ వైరాగ్యాన్ని ప్రకటిస్తున్నాడు. భాజపాలోనే ఉంటూ.. ఆ పార్టీ నాయకత్వం మీదే ఆగ్రహం ప్రకటిస్తూ.. ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఒడిదుడుకుల ప్రయాణం సాగించిన శివాజీ.. ఆ రంగం తనకు సూట్ కాదని వైరాగ్యం పెంచుకుని… తిరిగి సినిమాల్లోకి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.