” నేను వంద సీట్లు గెలుస్తా..సీఎం అవుతానంటాడు”… జగన్ ..” నేను నూట ఇరవై సీట్లు గెలుస్తా..నువ్వెలా సీఎం అవుతావ్” అంటాడు చంద్రబాబు…”మీరిద్దరూ ఏంటీ. నా ఫ్యాన్స్ ట్విట్టర్లో రెండు మిలియన్ల షేర్లు చేశారు..నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నానంటాడు” పవన్..” .. ప్రస్తుతానికి ఇది ఆన్లైన్లో వైరల్ జోక్. ఇలాంటి సెటైర్లు ఊరకనే రావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగానే నిరూపించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో..జనసేన ఐటీ విభాగాన్ని ప్రారంభించారు. ఓ రాజకీయ పార్టీ ఐటీ విభాగం కూడా ఈ స్థాయిలో ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా దాన్ని ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా ఎనిమిది వందల మంది వలంటీర్లు షిప్ఠుల వారీగా పని చేస్తారట. వీరందర్నీ శతఘ్ని టీమ్‌గా పిలుస్తారు.
టీడీపీ, వైసీపీ.. ఇలా వ్యవస్థీకృతంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. తొలి సారి పవన్ కల్యాణ్ ఓ ఐటీ కంపెనీలా… జనసేన ఐటీ వింగ్‌ను నడపాలని నిర్ణయించుకున్నారు. ఓ రాజకీయ పార్టీ కోసం.. ఎనిమిది వందల మంది ఆన్లైన్ వర్క్ చేయడం ..అదీ కూడా అఫీసులో కూర్చుని అంటే.. మామూలు విషయం కాదు ప్రస్తుత కాలంలో ఆన్లైన్ రాజకీయాలకు.. చాలా ప్రాధాన్యం ఉంది కానీ.. అదంతా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగే న్యూస్‌ను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఆ స్థాయిలో అసత్యాలు, అర్థసత్యాలు, మార్ఫింగ్‌లు, ఫేక్ ఫోటోలతో సోషల్ మీడియా రాజకీయం భ్రష్టుపట్టిపోయింది. ఇందులో ఏ పార్టీ తక్కువ కాదు. కానీ పవన్ కల్యాణ్
ఆన్ లైన్ ప్రచారంపైనే తన పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు దీని ద్వారా అర్థమయిపోతోంది.
ఫేస్ బుక్ పోస్టులు.. ట్విట్టర్ షేర్లు… వాట్సాప్ సందేశాలు..ఎప్పటికీ ఓట్లు తెచ్చి పెట్టలేవు. అందులో ఎలాంటి సందేహం లేదు. తమకంటూ ఓ అభిప్రాయం ఏర్పర్చుకున్న వారు… ఎవరయినా వాదనకు దిగితే..మరింత బలంగా తమ వాదన వినిపిస్తారు కానీ… మెత్తబడే ప్రశ్నే ఉండదు. చివరికి ఘర్షణకు సైతం దారి తీస్తాయి. సోషల్ మీడియాలో రాజకీయ చర్చలు అలాంటి వాటికే దారి తీస్తాయి. జనసేన శతఘ్ని టీమ్‌లో ఎనిమిది వందల మంది ఏం చేస్తారంటే.. ఇలాంటి వాదనలనే ఇతర పార్టీల నేతలతో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అలాంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఐటీ విభాగం మంచిదే కానీ.. దాన్నే నమ్ముకుని ఉంటే పవన్ కల్యాణ్‌కు నిరాశ తప్పదు. ముందుగా ప్రజల్ని నమ్ముకోవాలి.. ఆ తర్వాతే ఏదైనా..?
——–సుభాష్