ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎన్నికల వేడికి తెలుగు మీడియా చానళ్లు… ట్యూన్ అవుతున్నాయి. ప్రధాన పార్టీల ప్రముఖ నేతల ఇంటర్యూలను ప్రసారం చేసేందుకు … పోరాటపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. వైఎస్ జగన్ ప్రత్యేక ఇంటర్యూ అంటూ ఓ చానల్ మూడు రోజుల ముందు నుంచే.. హడావుడి చేసింది. ప్రొమోలు వేసి..భారీ పబ్లిసిటీ చేసింది. ఆ తర్వాత ఇంటర్యూ టెలికాస్ట్ చేసింది. అదే సమయంలో టీఆర్పీల్లో నెంబర్‌వన్‌గా ఉండే మరో చానల్… టీడీపీలో పవర్ సెంటర్‌గా ఉన్న నారా లోకేష్ ఇంటర్యూను తెరపైకి తీసుకు వచ్చింది. రెండు చానళ్లు తమ తమ ఇంటర్యూలను హైలెట్ చేసుకున్నాయి.
అయితే… చానళ్ల ప్రయత్నాలన్నీ టీఆర్పీల కోసమేనా..? పోటీ చానల్ చేస్తుందని… తాము కూడా చేస్తున్నారా..? అంటే… కానే కాదని చెప్పాలి. టీఆర్పీలకు మించిన రాజకీయం అందులో ఉందని కచ్చితంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే… జరిగిపోయిన బిగ్ బాస్ ఎపిసోడ్లో ఎవరు ఏం చేశారు.. అన్నదానిపై అరగంట పాటు విశ్లేషించుకుంటే వచ్చే టీఆర్పీ.. పొలిటికల్ ప్రోగ్రామ్ ఎయిర్ చేస్తే రాదు. ఇంటర్యూలు టెలికాస్ట్ చేస్తే అస్సలు రాదు. ఈ విషయం మీడియా వర్గాలకు తెలుసు. కానీ టీవీ చానళ్లు ఇంటర్యూలకు ప్రాధాన్యం ఇవ్వడానికి అంతకు మించిన కారణాలుంటాయి.
తెలుగు మీడియాలోని కొన్ని మినహా ప్రధాన చానళ్లు అన్నీ.. ఏదో ఓ పార్టీ ట్యాగ్‌ను మోస్తూ ఉంటాయి. కానీ ఏ చానల్ కూడా… తాము ఫలానా పార్టీకి మద్దతిస్తున్నామని చెప్పుకోదు. ఆ చానల్ చేసే ప్రసారాలను బట్టి.. తీసుకునే వార్తలను బట్టి ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. జగన్ ఇంటర్యూను ప్రసారం చేసిన ఎన్టీవీ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షం అని మెజార్టీ నమ్ముతారు. గత ఎన్నికలకు ముందు… టీడీపీని టార్గెట్ చేసి.. సర్వేలు ప్రసారం చేసి.. జగన్‌ను సంతృప్తి పరిచింది. అసలు వాస్తవ సర్వేలను పక్కన పెట్టి.. వైసీపీ గెలుస్తుందని చెప్పేసింది. ఆ తరవాత కూడా.. టీడీపీపై ఆ తరహా ప్రచారం చేసింది. కానీ తెర వెనుక ఏం జరిగిందో కానీ కొంత కాలం తన వైఖరి మార్చుకుంది. ఇప్పుడు జగన్‌కు మళ్లీ ఫుల్ స్వింగ్‌లో సపోర్ట్ చేస్తోంది.
ఇక లోకేష్ ఇంటర్యూని ప్రసారం చేసిన మరో టీవీ చానల్ యాజమాన్యానికి కులం అంటగట్టి… టీడీపీని సపోర్ట్ చేస్తుందని చెబుతూంటారు. కానీ ఆ చానల్ చూసేవారికి అలాంటి ఫీలింగ్ మరీ అంత తేడాగా రాదు. కానీ… జగన్ ఇంటర్యూ పోటీ చానల్లో వస్తున్న సమయంలోనే… ఆ టీవీ చానల్ కూడా లోకేష్ ఇంటర్యూని హైలెట్ చేసిందంటే.. తెర వెనుక ఏదో జరిగి ఉంటుందని.. భావిస్తున్నారు. నిజానికి కులం పేరుతో .. టీడీపీకి సపోర్ట్ చేస్తుందని విశ్లేషించేవారు.. జగన్‌కు అండగా నిలుస్తున్న.. చానల్ అధినేత సామాజికవర్గాన్ని మాత్రం ప్రస్తావించారు. ఎందుకంటే ఆయనదీ అదే కులం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. మీడియాలోనూ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. తమ బలాన్ని చూపించుకోవడానికి… ఎవరికి వారు… ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇది ముందు ముందు మరింతగా పెరగనుంది.