టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మీద వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు తెలిసినవే. సీఎం రమేష్ కి చదవురాదనీ, ఇంగ్లిష్ తెలీదనీ, హిందీ అర్థం కాదంటూ విజయసాయి చేసిన విమర్శలపై సీఎం రమేష్ ఘాటుగా స్పందించారు. ‘నాకేదో చదువు రాదు, తెలుగు రాదూ ఇంగ్లిష్ రాదంటూ హిందీ రాదంటూ ఆయన అంటున్నారు. నాకు తెలిసింది ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడం మాత్రమే’ అంటూ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం తరఫున పోరాడమంటూ ప్రజలు వారిని పార్లమెంటుకు పంపిస్తే, భాజపాకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందోనన్న భయంతో పోరాటం మానేశారని రమేష్ అన్నారు. వాళ్లు భాజపాకీ ప్రధాని మోడీకి భయపడుతున్నారనీ, వారిపై ఉన్న కేసులకు భయపడుతున్నారనీ, అంతేతప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై వారికి ఏమాత్రం బాధ్యత లేదన్నారు.
నిన్నటి సమావేశంలో తామే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినట్టు విజయసాయి మీడియా ముందు చెప్పుకున్నారనీ, కానీ వాస్తవంగా ఆయన ఏం మాట్లాడారో కావాలంటే మీడియాకు ఇస్తానన్నారు సీఎం రమేష్. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రా ప్రజలు సంతోషిస్తారని మాత్రమే చెప్పారుగా, ఇచ్చి తీరాలని డిమాండ్ చెయ్యలేదన్నారు. వారు మొదటి అంశంగా ప్రత్యేక హోదా గురించి ప్రధాని ముందు ప్రస్థావించానని బయట చెప్పడం అబద్ధమన్నారు. వారికి అవకాశం రాగానే ఫిరాయింపు నిషేధ చట్టం గురించి మాట్లాడారనీ, అంతేగానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ముందుగా విజయసాయి మాట్లాడలేదని చెప్పారు.
ప్రజల సొమ్మును దోచుకుని దొంగ లెక్కలు తయారు చేయడం విజయసాయిరెడ్డికి తెలిసిన విద్య అనీ, ఆ ట్రెయినింగ్ తనకు రాలేదని సీఎం రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ కు ఆడిటర్ గా ఉండి ఏం చేశావనేది ప్రజలకు తెలుసు అన్నారు. పదహారు నెలలు జైల్లో గడిపి, ఇప్పుడు ఢిల్లీ వచ్చి పేరున్న నాయకుల్ని విమర్శించినంత మాత్రాన గొప్ప నాయకుడు అయిపోతాడా అంటూ మండిపడ్డారు. జగన్ ను కాపాడానంటూ చెప్పుకుని, పార్టీలో తనని నంబర్ వన్ చేయాలంటూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ విజయసాయి వైకాపాలో ఉంటున్నారని ఆరోపించారు. తాను మెడికల్ క్యాంపులు పెట్టాననీ, ఒక కాలనీని నిర్మించాననీ, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేశానని జీఎం రమేష్ చెప్పుకున్నారు. ఇలాంటి ఒక్కటంటే ఒక్కపనైనా విజయసాయి రెడ్డి చేస్తే చెప్పాలంటూ సవాల్ చేశారు.
మొత్తానికి, తన మీద వైకాపా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రమేష్ ఉద్వేగభరితంగానే స్పందించారు. దీంతోపాటు ఢిల్లీలో నిన్న జరిగిన సమావేశంలో విజయసాయి ముందుగా ఏ అంశాలు మాట్లాడారో చెప్పారు. నిన్నటి సమావేశంలో ఏపీ ప్రయోజనాల గురించి తాను మాత్రమే ప్రధానితో మాట్లాడినట్టు విజయసాయి మీడియా ముందు చెప్పిన సంగతి తెలిసిందే.