మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం `వైఫ్ ఆఫ్ రామ్`. ఈవారమే విడుదల కాబోతోంది. ట్రైలర్లు చూస్తుంటే ‘కహానీ’ పోలికలు బీభత్సంగా కనిపిస్తున్నాయి. ఓ భర్త ఆచూకీ కోసం భార్య అన్వేషణ సాగించడమే కహానీ. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ చూస్తే… అదే కంటెంట్ కనిపిస్తోంది. దాంతో కహానీ సినిమానే కాస్త అటూ ఇటూ మార్చి ఈ సినిమా తెరకెక్కించారన్న కామెంట్లు వినిపించాయి. దీనిపై మంచు లక్ష్మి స్పందించింది. ఈ రెండు సినిమాలకూ ఎలాంటి పోలిక లేదని, రెండూ భార్యల కథలే అని, ఆ ఒక్క విషయంలో తప్ప దేనిలోనూ రెండూ ఒకటి కావని క్లారిటీ ఇచ్చేసింది.
”ఇది ఓ సాధారణ అమ్మాయి, మహిళ, గృహిణి ప్రయాణం. ఒక సంఘటన తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది. అనేది నా పాత్ర. అయితే ఈ మధ్య వినిపిస్తోన్నట్టుగా ఈ సినిమాకు బాలీవుడ్ కహానీకి ఈ సినిమాకూ ఏ సంబధం ఉండదు. నా పాత్ర పేరు దీక్ష. తను ఓ ఎన్జీవోలో పనిచేస్తుంటుంది. తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే.. బాబాయ్ ఇంట్లో పెరుగుతుంది. తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని.. హ్యాపీగా ఉంటోన్న టైమ్ లో సడన్ గా దీక్ష జీవితంలో జరిగిన సంఘటన ఎలాంటి మార్పులు తెచ్చింది. సామాజికంగానూ తనకు ఏ సహాయం దొరకనప్పుడు తను న్యాయం కోసం ఏం చేసింది అనేది ఈ దీక్ష కథ. సింపుల్ గా ఇది ఓ భార్య కథ” అంది లక్ష్మి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.