పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా పాలు పంచుకున్న ఓ కుంభకోణాన్ని బయటపెడతానని… ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కొద్ది రోజులుగా చెబుతున్నారు. అన్నట్లుగానే ఆయన పార్లమెంట్ సమావేశాల తొలి రోజే ఎస్సార్ ఆయిల్స్ – రోసెనెఫ్ట్ అనే రష్యా సంస్థ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో అతి పెద్ద స్కాం జరిగిందని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో భారత్ కు చెందిన ఎస్సార్ ఆయిల్స్ కంపెనీ.. తన సంస్థలో 49 శాతం వాటాను రష్యాకు చెందిన రోసెనెఫ్ట్ కంపెనీకి విక్రయించింది. ఈ ఒప్పంద విలువ దాదాపుగా పదమూడు బిలియన్ డాలర్లు. భారతదేశ వ్యాపార చరిత్రలో ఇదో అతి పెద్ద డీల్ గా ప్రచారం పొందింది.
ఈ డీల్ విషయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కుంభకోణానికి పాల్పడ్డారని… కుటంబరావు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎస్సార్ ఆయిల్ – రోసెనెఫ్ట్ డీల్ జరిగిందని కాబట్టి.. ఈ కుంభకోణానికి ఆయనే బాధ్యత వహించాలంటున్నారు. ఈ డీల్ తో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారని.. దేశానికి రావాల్సిన టాక్స్ ఒక్క రూపాయి కూడా రాలేదంటున్నారు. రష్యాకు చెందిన ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం జరిగితే… ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగినట్టు చూపెట్టడమే కుంభకోణంలో అసలు కోణం అంటున్నారు. ప్రధాని మోదీ పదేపదే విదేశాలు తిరగడం…ఎస్సార్ ఆయిల్ కుంభకోణం డబ్బుల కోసమేనని కుటుంబరావు తేల్చారు. ఈ డీల్ విషయం రష్యాలోనూ కలకలం సృష్టించిందని… రష్యా అధ్యక్షుడు పుతిన్… అక్కడి మంత్రిని అరెస్ట్ చేయించారని బయటపెట్టారు. ఈ ఒప్పందం జరిగిన సమయంలో…ప్రధాని మోదీ చైనాలో అనధికారికంగా పర్యటించారని కూడా కుటుంబరావు ఆరోపించారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించానని.. వాటిని బయటపెడతానని కుటుంబరావు స్పష్టం చేశారు. పార్లమెంట్ లో ఈ అంశాన్ని లెవనెత్తాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. తాము సేకరించిన సమాచారాన్ని అన్ని పార్టీలకు తెలియజేసి… దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే ఈ విషయంలో… కుటంబరావు పరిశోధన ఎంత వరకూ …దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నది..త్వరలో తేలనుంది. అయితే.. ఎస్సార్ ఆయిల్స్ యాజమాన్యంతో బీజేపీకి సన్నిహిత సంబంధాలున్న విషయం బహిరంగ రహస్యం. కాబట్టి.. దేశవ్యాప్తంగా ఈ అంశం.. హాట్ టాపిక్ అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.