ఎన్టీఆర్ మహానటుడే కాదు, కుటుంబానికి యజమాని కూడా. బోలెడు మంది సంతానం. కొడుకులు, కోడళ్లు, అల్లుళ్లు, మనవలు, మునిమనవలు. ఆయన బతికి వుండగానే చాలామందని చూసారు. అలాంటి బహుకుటుంబం ఆయనది.
ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకమైన బసవరామతారకం పాత్ర పోషించడం కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆ కుటుంబంలోని జనాలను కలిసిందట. ఇదంతా ఎన్టీఆర్ సతీమణి పాత్ర పోషణకు కావాల్సిన ఇన్ పుట్స్ కోసమే అని సినిమా ప్రచార కర్తల హడావుడి.
ఇంతకీ విద్యాబాలన్ కలిసింది ఎవరిని? హీరో కమ్ నిర్మాత బాలయ్యను, ఆయన భార్య వసుంధరను. ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరని. బాలయ్య పిల్లలు చిన్నవారు. వాళ్లకు నానమ్మ గురించి మరీ ఎక్కువ తెలియకపోవచ్చు.
కానీ అసలు సిసలుగా బాలయ్య కన్నా పెద్దవాళ్లయిన జయకృష్ణ, హరికృష్ణ కుటుంబాలు వున్నాయి. పెద్ద కొడుకులు, పెద్ద కోడళ్లు వున్నారు. అలాగే లోకేశ్వరి తరువాత పుట్టిన పురంధ్రీశ్వరి కూడా వున్నారు. వీళ్లందరి నుంచి ఇన్ పుట్స్ వస్తాయి. ముఖ్యంగా మగపిల్లల కన్నా కోడళ్లు, ఆడపిల్లల నుంచే బసవరామ తారకం పై ఇన్ పుట్స్ ఎక్కువ రావడానికి అవకాశం వుంది.
ఇలా అందరినీ కలిస్తే, అప్పుడు విద్యాబాలన్ పక్కాగా ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిసి ఇన్ పుట్స్ తీసుకున్నారు అనాలి. అంతే కానీ బాలయ్య ఇంటికి వెళ్లి వచ్చినంత మాత్రాన ఇన్ పుట్స్ ఎలా వస్తాయి? ఆ మాత్రం ఇన్ పుట్స్ బాలయ్య సెట్ లోనే ఇస్తారు కదా?
తండ్రి సినిమా విషయంలో బాలయ్య మరీ ఏకపక్షంగా వెళ్లిపోతున్నారేమో? అన్నదమ్ములకు సినిమాలో పాత్ర లేకపోవచ్చు . లేదా సినిమా మేకింగ్ లో జొక్యం లేకపోవచ్చు. కానీ కథ తయారీలో, పాత్రల చిత్రణలో వాళ్ల అభిప్రాయాలు కూడా వుంటే మరింత బాగుంటుంది కదా? ఎందుకంటే సావిత్రి మాదిరిగా ఎన్టీఆర్ కు ఒకరిద్దరు పిల్లలు కాదు. ఆయన బహుకుటుంబీకుడు.
ఇలా ఇంటికి వెళ్లడం, చీర సారెపెట్టడం వంటివి సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడతాయేమో కానీ సినిమా మేకింగ్ కు మాత్రం కాదేమో?