పార్లమెంటులో తగిన మద్దతు లభించడంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రం చర్చకు సిద్ధపడింది. ఈ శుక్రవారం సభలో చర్చ ఉంటుంది. దీంతో ఇప్పుడు సభలో ఏయే అంశాలపై చర్చించాలీ, ఏయే అంశాలను ప్రధానంగా లేవదీయ్యాలీ, భాజపాతోపాటు ఇతర పార్టీలు చేస్తున్న విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఓపక్క పార్టీ ఎంపీలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే, ఇంకోపక్క ఉన్నతాధికారులతో సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. దీని కోసమే సీఎస్ తోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులతో ఆయన చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే రాజకీయంగా ఇతర పార్టీల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఎంపీలు చేస్తున్నారు. దీంతోపాటు భాజపాలో ఉండే అసంతృప్త నేతలతో కూడా సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.
ఇక, సాంకేతికంగా కూడా సభలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేదానిపై అధికారులతో సీఎం చర్చలు నిర్వహిస్తున్నారు. కేంద్రం ఇప్పటికే ఆంధ్రాకు చాలా చేసిందని ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ లెక్కల్ని తీసే పనిలో ఉన్నారు. కేంద్రం చెబుతున్న అంకెలూ, వాస్తవంగా రాష్ట్రానికి అందిన నిధుల జాబితాను ప్రధానంగా సిద్ధంగా చేస్తున్నారు. దీన్లో భాగంగానే శాఖలవారీగా అధికారులతో సీఎం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్రానికి పదికి పైగా కేంద్ర సంస్థలను ఇచ్చామని భాజపా ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఆయా సంస్థలకు వచ్చిన నిధులు ఎంతెంత అనే లెక్కలు కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీంతోపాటు జాతీయ ప్రాజెక్టు పోలవరానికి భాజపా సర్కారు నుంచి అందించిన సాయమెంత, ఎయిమ్స్ లాంటి సంస్థల నిర్మాణం ఎంతవరకూ వచ్చిందనే అంశాలపై కూడా సభలో లేవనెత్తేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా అంశమై సీఎం చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారన్న విమర్శల్ని ప్రధానంగా తిప్పి కొట్టాలనీ భావిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో నాడు ప్యాకేజీకి అంగీకరించాల్సి వచ్చింది, తద్వారా వచ్చిన ప్రయోజనాలను కేంద్రం ఇవ్వకపోవడంతో ఏ పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను మళ్లీ డిమాండ్ చేస్తున్నామన్న అంశంపై సభలో స్పష్టంగా వివరించే కసరత్తు కూడా చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర పెద్దల మాటల్ని నమ్మడం వల్లనే ప్యాకేజీకి అంగీకరించామన్న వాదనను బలంగా వినిపించాలని భావిస్తున్నారు. ఇలా ప్రతీ అంశంపైనా ఎంపీలకు సమగ్ర సమాచారం అందించి, చర్చకు సంసిద్ధం చేసే ప్రయత్నంలో సీఎం ఉన్నారు.
నిజానికి, ఈ అవిశ్వాస తీర్మాన చర్చలో ఏపీకి చాలా చేశామనే వాదనను భాజపా కూడా చాలా బలంగా వినిపించేందుకే వారూ పెద్ద ఎత్తున కసరత్తే చేస్తారు. ఓరకంగా చెప్పాలంటే… ఆ వాదనను వినిపించే అవకాశాన్ని కల్పించుకోవడం కోసమే అవిశ్వాస తీర్మాన చర్చకు అంగీకరించారని అనుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి, భాజపాకి ధీటుగా సభలో చర్చించాలంటే… అంతే స్థాయిలో చర్చకు ఎంపీలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీఎం అదే పనిలో తలమునకలైనట్టు సమాచారం.