జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు భాష అంటే ఎనలేని మక్కువ. తెలుగు భాషా ప్రియుడు పవన్ కళ్యాణ్. తెలుగు సాహిత్యంపై కూడా ఆయనకు మంచి పట్టు. కేవలం అభిమానం ఉండటమే కాదు.. తెలుగు భాషను పరిరక్షించడానికి తనవంతు సాయం చేయడానికి కూడా ఎప్పుడూ ముందుటారాయన. గతంలో తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణ కోసం నడుం బిగించారు పవన్ కళ్యాణ్. ‘నిర్బంధ తమిళం’ జీవో కారణంగా తమిళనాడులో మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ నిరసన దీక్ష చేపట్టింది. రాజకీయాలను పక్కన పెట్టి కేవలం తెలుగు భాషపై ప్రేమతో ఆ దీక్షకు మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి స్పదించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. తెలుగు భాష పరిరక్షణ పట్ల ఆయనకి వున్న నిబద్ధతకు ఇది నిలువుటద్దం.
ఇది మరో నిదర్శనం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన సమాచార కార్యాలయానికి ‘గిడుగు వెంకట రామ్మూర్తి పంతులుగారి పేరు పెట్టారు. ‘ ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ పేరుతో నూతన కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించారు. తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
‘గిడుగు’ వారిని మరోసారి గుర్తు చేస్తూ జనసేన కొత్త కార్యాలయానికి ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ అని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్. సమాచార సేకరణ, విశ్లేషణ, పార్టీ శ్రేణులకు సమాచారం అందించడం, లైబ్రెరీ నిర్వహణ, నిరంతర సమాచారం.. ‘గిడుగు వెంకట రామమూర్తి ఇన్ఫర్మేషన్ సెల్’ కీలక విధులు.