చిన్న సినిమాలవైపు సినిమా రంగం మొత్తం తలెత్తుకుని చూస్తోంది. చిన్న సినిమాలతో అద్భుతాలు సృష్టించొచ్చని నమ్ముతోంది. కాకపోతే కావల్సిందల్లా… బలమైన కథే. దిల్‌రాజు కూడా చిన్న సినిమాలతో ఎదిగినవాడే. చిన్న సినిమాల్నీ, కొత్త దర్శకుల్ని, కొత్త టాలెంటునీ ప్రోత్సహించిన వాడే. బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం చిన్న సినిమా కాదా? ఆ సినిమాలతో దిల్‌రాజు సంస్థ పరపతి పెరగలేదా? అలాంటి దిల్‌రాజునే ఇప్పుడు ‘చిన్న సినిమాలతో వేగడం కష్టం’ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు. కొత్త వాళ్లతో సినిమాలు తీసి, జనాల్ని థియేటర్లకు రప్పించడానికి చాలా కష్టపడాల్సివస్తోందని, అదేదో… మినిమం రేంజున్న హీరోతో సినిమా తీస్తే ఆ రిస్కు తప్పుతుందని, టైమ్ కూడా కలిసొస్తుందని సెలవిచ్చాడు. అంతేకాదు… తన కేరింత సినిమాని ఉదాహరణగా నిలిపాడు. రీషూట్లు చేసి మరీ ఓ సినిమాని సిద్ధం చేస్తే, టాక్ బాగున్నా జనాలు థియేటర్లకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే కొత్త వాళ్లతో సినిమా తీయడానికి భయపడుతున్నాడట.
హ్యాపీడేస్‌కి మరో రూపం కేరింత. అంతకు మించిన స్పెషాలిటీ ఆ సినిమాలో లేదు. అందుకే ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. చిన్న సినిమాలకు `దిల్ రాజు` పేరే బ్రాండ్. దాంతో జనాలు రావాలి. వస్తున్నారు కూడా. కథలో బలం లేకపోతే జనం ఎలా చూస్తారు?? చిన్న సినిమా తీస్తే జనాన్ని థియేటర్లకు కష్టమన్నది దిల్‌రాజు మాట. మరి ఆర్.ఎక్స్ 100ని జనం అలా ఎగబడి ఎందుకు చూస్తున్నారు? పెళ్లి చూపులు లాంటి సినిమాల్ని ఎలా చూడగలిగారు? అంటే ఇక్కడ లోపం చిన్న సినిమాలో లేదు. స్ట్రాటజీలో ఉంది. దిల్‌రాజు దృష్టంతా కేవలం పెద్ద సినిమాలపై పడిందని, చిన్న సినిమాల్ని ఆయన పట్టించుకోవడం లేదని అందుకే అవి గాడి తప్పుతున్నాయన్నది ఫిల్మ్‌నగర్ మాట. దాన్ని ఇలా కవర్ చేసుకుంటున్నాడన్నమాట. దిల్ రాజులాంటి స్టార్ నిర్మాతలు, అనుభవజ్ఞులే చిన్న సినిమాలపై ఇలాంటి నెగిటీవ్ స్టేట్మెంట్లు ఇస్తే… కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టి, చిన్న సినిమాలతో నిరూపించుకోవాలని అనుకున్న వారి సంగతేంటో..??