అవిశ్వాసంపై చర్చలో తెలుగుదేశం పార్టీకి పదమూడు నిమిషాల సమయం దక్కింది. పార్టీల బలబలాల ఆధారంగా స్పీకర్ సమయం కేటాయించారు. బీజేపీకి 3 గంటల 33 నిమిషాలు, కాంగ్రెస్‌కు 38 నిమిషాలు, అన్నాడీఎంకేకు 29 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 27 నిమిషాలు, బీజేడీకి 15 నిమిషాలు, శివసేనకు 14 నిమిషాలు, టీఆర్ఎస్కు 9 నిమిషాల సమయం కేటాయించారు. అవిశ్వాసం చర్చ శుక్రవారం లోక్‌సభలో 11 గంటలకు మొదలవుతుంది. అవిశ్వాసం తీర్మానం నోటీసులను కేశినేని నాని ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఈ చర్చను నాని ప్రారంభించాల్సి ఉంది. కానీ చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌తో చర్చను మొదలుపెట్టాలని నిర్ణయించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం అప్పట్లో ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దీనితో జయదేవ్తోనే చర్చ మొదలుపెట్టాలని నిర్ణయించారు.. చంద్రబాబు నిర్ణయానికి అనుగుణంగా జయదేవ్తోనే చర్చను ప్రారంభిస్తామని స్పీకర్‌కు లేఖ ఇచ్చారు.. 13 నిమిషాల సమయం సరిపోదని టీడీపీ భావిస్తోంది.. అదనపు సమయం ఇవ్వాలని కోరే అవకాశం కూడా కనిపిస్తోంది.. మొత్తంగా ఇచ్చిన సమయంలో సూటిగా, అంశాలవారీగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించేలా జయదేవ్ మాట్లాడబోతున్నారు.. వీలుంటే రామ్మోహన్నాయుడుతోనూ మాట్లాడించాలని కూడా నిర్ణయించారు. విభజన చట్టంలో ఇప్పటివరకు 18 అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
బీజేపీకి అత్యధిక సమయం దక్కింది. సహజంగా వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఏపీకి వారేమీ చేశారో చెప్పడం కన్నా ఎదురుదాడి చేయడానికే ఎక్కువ అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఎంపీలతోనే… టీడీపీ వాదనను అడ్డుకునే వ్యూహం బీజేపీ అమలు చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేశారని టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో వ్యాఖ్యానించడంతో .. అసలు రాజకీయాన్ని టీడీపీ అర్థం చేసుకుంటోంది. దీనికి అనుగుణంగా విరుగుడు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి రేపు అవిశ్వాస తీర్మానం చర్చ సమయంలో నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.