అవిశ్వాస తీర్మానంపై చర్చలో బీజేపీ తరపున మాట్లాడిన కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. గల్లా జయదేవ్ తన ప్రసంగంలో లెవనెత్తిన అంశాలు మత దృష్టికొచ్చాయని చెప్పుకొచ్చారు. కానీ ఏ ఒక్కదానిపై స్పష్టంగా స్పందించలేదు. ప్రధానమైన డిమాండ్ ప్రత్యేకహోదా ఇవ్వలేమని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఏం చేయాల్సి ఉందో చెప్పలేదు. ప్రత్యేక సాయం కింద నిధులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రం చెప్పారు. టీడీపీ ఏపీ సమస్యలను మన ముందుకు తీసుకొచ్చింద్న ఆయన … ఏ ఒక్క దానికీ సూటిగా సమాధానం చెప్పలేదు.
ఇతర బీజేపీ నేతలు చాలా రోజులుగా చేస్తున్న జనరలైజ్ చేసి చేస్తున్న రాజకీయ ప్రకటనలనే…రాజ్ నాథ్ లోకసభ లో వినిపించారు. విభజన చట్టంలోని అన్ని హామీలు దాదాపుగా అమలు చేశామనేశారు. మిగిలిన హామీలు అమలు చేస్తామన్నారు. ఏ హామీలు అమలు చేశారు.. ఏ హామీలు అమలు చేయాల్సి ఉందన్నదానిపై ఇసుమంత కూడా క్లారిటీ ఇవ్వలేదు. అమరావతి నిర్మాణానికి రూ.1500కోట్లు, పోలవరానికి రూ.6500కోట్లు ఇచ్చినట్లు మాత్రం లెక్క చెప్పారు. విభజన చట్టంలో తొలి ఏడాది రెవిన్యూలోటును భర్తీ చేయాలని ఉన్న అంశాన్ని కూడా జనరలైజ్ చేశారు. ఐదేళ్లలో ఏపీకి రూ.22వేల కోట్లు రెవెన్యూలోటు భర్తీ కింద 14వ ఆర్థిక సంఘం చెప్పిందని ఇప్పటికే రూ.15వేల కోట్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. కానీ తొలి ఏడాది భర్తి చేయాల్సిన రెవిన్యూ లోటు రూ. 16వేల కోట్లు అయితే.. కేవలం రూ.4 వేల కోట్లు ఇచ్చి సరిపెట్టిన విషయాన్ని మాత్రం దాచి పెట్టారు.
వందల కి.మీ. రోడ్లు, ఎయిమ్స్ , ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేశామన్నారు. రాజ్ నాథ్ మొత్తం ప్రసంగంలో ఎక్కడా.. క్లారిటీ లేదు. గత మూడేళ్ల నుంచి బీజేపీ ఇంటా బయటా చెబుతున్న మాటలనే చెప్పకొచ్చారు. గల్లా జయదేవ్ ప్రసంగంలో లేవనెత్తిన ఏ ఒక్క అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం.. రాజ్ నాథ్ చాలా సానుకూలంగా మాట్లాడారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు.. ఆయినా రాజకీయాలు ఎలా ఉన్నా..చంద్రబాబు తమకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు.