ఆరు నెలల్లో ఇంద్రభవనం లాంటి కార్యాలయాన్ని బీజేపీ కట్టుకున్నప్పుడు… నాలుగేళ్లలో ఏపీలో ఎయిమ్స్, ఐఐటీలను ఎందుకు పదిశాతం కూడా పూర్తి చేయలేకపోయారని.. తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో గళమెత్తారు. హిందీలో అనర్గళంగా ప్రసంగించిన రామ్మోహన్ ప్రత్యేకహోదా నుంచి రైల్వేజోన్ వరకు.. కేంద్రం చేసిన మోసాన్ని ఎండగట్టారు. ఉత్తరాది ఎంపీలకు ధీటుగా హిందీలో తడుముకోకుండా ప్రసంగించిన రామ్మోహన్ నాయుడు.. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును..సమగ్రంగా ఎండగట్టారు. నాలుగేళ్లలో 5శాతం నిధులిస్తే… 100శాతం ఇవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందని నిలదీశారు. నిబంధనలు అడ్డుగా ఉన్నాయనుకుంటే… పోలవరం ముంపు ఏడు మండలాను ఏపీకిచ్చినట్టు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రెవెన్యూ లోటు ఉన్న ఏడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ఉండకూడదన్నారు. ఈ సభలో చేసిన చట్టానికి విలువ లేదా?, ప్రధాని మోదీని సూటిగా అడుగుతున్ననని రామ్మోహన్ నాయుడు… ధాటిగా ప్రసంగించడంతో బీజేపీ ఎంపీలు నిర్ఘాంతపోయి చూస్తూండిపోయారు.
విభజన హామీల విషయంలో ఏం చేయాలో… చట్టంలో స్పష్టంగా ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైల్వేజోన్ కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని ..అయినా ఎందుకు నాన్చుతున్నారని ప్రశ్నించారు. అవసరమైతే నిబంధనలు మార్చాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు సభలో మాట్లాడిన విశాఖ ఎంపీ హరిబాబు ప్రసంగంలోని డొల్లతనాన్ని రామ్మోహన్ నాయుడు బయటపెట్టారు. ఎస్పీవీ కింద నిధులిస్తామంటూ హరిబాబు ఇష్టారీతిన మాట్లాడారని… నిబంధనలు ఎప్పుడు ఫిక్స్ చేశారు, ఎవరికిస్తారు నిధులు క్లారిటీ ఇవ్వాలన్నారు. ఈ విషయం కేంద్రం కాకుండా.. హరిబాబు మాట్లాడటమేమిటన్నారు. నిధులిస్తాం.. నిధులిస్తామంటున్నారు పన్నుల మినహాయింపు సంగతేంటని మండిపడ్డాు.
ఏపీలో పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ కడతామంటే కనీసం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వలేదన్నారు. ఒక ప్రధాని చెప్పింది మరో ప్రధాని చేయనప్పుడు ఇక చట్టాలు చేయడమెందుకు?.. అందులో చెప్పినదానికి విలువ ఏముంటుంది? ప్రజల్లో పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతందని ప్రశ్నించారు. చివరిగా ఇవన్నీ ప్రధానికి తెలియని విషయాలు కాదన్నారు. నాలుగేళ్లుగా నలుగుతున్న విషయాలేన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వచ్చినప్పుడు.. ఆయన ఆంధ్రులకు ఇచ్చిన హామీలేనని గుర్తు చేశారు. మొత్తానికి ఉదయం గల్లా ప్రసంగం.. సాయంత్రం రామ్మోహన్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను… బలంగా దేశ ప్రజల ముందు ఉంచగలిగాయి.