పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడీ చర్చ జరుగుతోంది! ఆంధ్రాకి చేసిన సాయం విషయంలో కేంద్రం చేసుకుంటున్న ప్రచారం, విభజన చట్ట ప్రకారం రావాల్సిన ప్రయోజనాల లెక్కలపై టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ప్రధానిని నిలదీశారు. సరే, ఈ చర్చలో పాల్గొనే అవకాశాన్ని చేజేతులా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జారవిడుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభకు హాజరుకాలేని వైకాపా ఎంపీలు, సభలో ఏపీ ప్రయోజనాలపై జరుగుతున్న చర్చ తీరును రాష్ట్ర ప్రయోజనాల కోణం నుంచి కాకుండా… రాజకీయ లబ్ధి నుంచి మాత్రమే చూస్తున్నారు..! పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ప్రసంగంపై విశ్లేషణకు దిగారు ప్రత్యేక హోదా కోసం పదవుల్ని రాజీనామాలు చేసిన ఎంపీల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి..!
టీడీపీ, భాజపా లోపయికారీ ఒప్పందం గురించి, ఆ రెండు పార్టీల బంధం గురించి తాము మొదట్నుంచీ చెబుతూ వస్తున్నదే నిజమైందని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగినా కూడా ఏపీ సీఎం మిత్రుడే అని రాజ్ నాథ్ చెప్పడమే ఆ రెండు పార్టీల లోపయికారీ ఒప్పందానికి సాక్ష్యమని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది! కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యల్లో టీడీపీ నాటకం మరోసారి బయటపడిందన్నారు. అంతేకాదు, రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతున్నంతసేపూ తెలుగుదేశం ఎంపీలు కనీసం నిరసన తెలిపే ప్రయత్నం కూడా చెయ్యలేదని, వింటూ అలా కూర్చునే ఉన్నారని తప్పుబట్టారు. భాజపాతో బంధం కొనసాగుతోంది కాబట్టే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లలేదని వైవీ విమర్శించారు.
‘చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకి వెళ్లి మోడీ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన తమకు స్నేహితుడు’అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. అయితే, ఎన్డీయే నుంచి బయటకి వెళ్లి మోడీపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారనే మాటను వైవీ సుబ్బారెడ్డి ప్రస్థావించకపోవడం గమనార్హం! వారికి విమర్శించడానికి అనుకూలమైన వాక్యాలను మాత్రమే సంగ్రహించడం జరిగిందన్నమాట! ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లకపోవడం భాజపాతో లోపయికారీ ఒప్పందానికి సాక్ష్యమన్నారు. నిజానికి, ఈ సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది..? పార్లమెంటులో మాట్లాడాల్సింది ఎంపీలు, ఆ పని వారు ఎలాగూ చూస్తున్నారు. వారికి దిశానిర్దేశం సహజంగానే ముఖ్యమంత్రి నుంచి వెళ్తుంది! సరే, ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే… గత పార్లమెంటు సమావేశాల్లో బాగా పోరాడామని వైకాపా ఎంపీలు చెప్పుకున్నారు కదా. ఆ సమయంలో జగన్ ఢిల్లీ వెళ్లలేదే..? ఈ లాజిక్ ప్రకారం అప్పుడు భాజపాతో జగన్ లోపయికారీ రాజకీయం చేశారా..?