ప్రత్యేకహోదా ఇస్తామన్నది ఎవరు..? యూటర్న్ తీసుకుని ఇప్పుడు కుదరదని చెబుతోంది ఎవరు..? అదే పెద్ద మనిషి ఇప్పుడు ఎవర్నీ యూటర్న్ తీసుకున్నారని నిందిస్తున్నారు..? విభజన హామీల్లో అత్యంత ముఖ్యమైనది ప్రత్యేకహోదా. ప్రత్యేక హోదాపై 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. సరిగ్గా 9 రోజుల తర్వాత మార్చి 1న కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. మరో నాలుగురోజులకు మార్చి 5న కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. తమకు సమయం లేనందువల్ల ప్రత్యేక హోదా ను అమలు చేయలేకపోయామని మన్మోహన్ సింగ్ కూడా తర్వాత రోజుల్లో రాజ్యసభలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో కూడా.. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.
ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, రాజ్యసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన ను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తామని మోదీ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో బిజెపి నేతలు చెప్పారు. జాతీయ అభివృద్ది మండలిలో మెజారిటీ ముఖ్యమంత్రులు బిజెపి, కాంగ్రెస్ కు చెందిన వారే కనుక ఎన్డీసీ అనుమతి కూడా లభిస్తుందని వాదించారు. మెల్లగా… ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పెట్టారు. చివరికి పధ్నాలుగో ఆర్థిక సంఘాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. ఆర్థిక సంఘం పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యక ప్రయోజనాలివ్వాలని చెప్పిందటూ.. తమంతట తాముగా… అనేసుకుని… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. అంటే… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన హామీపై తానే యూటర్న్ తీసుకున్నారు.
బీజేపీ ప్రభుత్వం.. నరేంద్రమోడీ చేస్తున్న కుట్రను గుర్తించలేని చంద్రబాబు హోదా పేరు లేకుండా.. అన్నీ ఇస్తామని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన అంగీకరించారు. కానీ ఒక్క రూపాయి అంటే.. ఒక్క రూపాయి కూడా.. ప్యాకేజీ కింద నిధులు ఇవ్వలేదు. పైగా.. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఉండదని చెప్పి.. ఇప్పుడు… పదకొండు రాష్ట్రాలకు పొడిగించారు. ఈ మోసం బయటపడటం.. ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో.. చంద్రబాబు… మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ ఎత్తుకోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో యూటర్న్ తీసుకుంది మోడీ అయితే.. అదే మోడీ.. చంద్రబాబును యూటర్న్ తీసుకుంటున్నారని విమర్శించడం.. అసలు రాజకీయం.