పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఏపీ గురించి కనీసం పది నిమిషాలు కూడా ఆయన సమయం కేటాయించి మాట్లాడకపోవడం విచారకరం. అంతేకాదు, ఆయన ప్రసంగం మొత్తం ఎద్దేవా పూర్వకంగా, అడుగడుగునా అహంకారపూరితంగా సాగడం శోచనీయం. ప్రధాని ప్రసంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానంతో భూకంపం రాలేదే అని ప్రధాని ఎద్దేవాపూర్వకంగా మాట్లాడటం బాధాకరమని చంద్రబాబు అన్నారు. సభలో ఓటింగ్ విధానం, ప్రధాని తీరు గమనిస్తే అధికార పక్షం విశ్వాసం నిరూపించుకోలేనట్టుగానే ఉందన్నారు. తాను ప్రధానమంత్రిని అనే అహంకారంతో, అధికారం ఉందనే ధీమాతో మోడీ స్పందించారనీ, కనీసం పది నిమిషాలు కూడా ఏపీ గురించి ఆయన మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాకి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని చెబుతున్నారనీ, కానీ అధికారంలో ఉన్న భాజపా చేసిన న్యాయమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చినవారిగా రాష్ట్ర అభివ్రుద్ధికి ఎందుకు సాయం చేయడం లేదన్నారు. కేవలం 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని చులకనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అంత లోకువా, ఆంధ్రులు ఓట్లెయ్యకపోయినా తమకేం కాదన్న అహంభావమా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆస్తులపై గురిపెట్టామని ప్రధాని మాట్లాడటం అభ్యంతకరంగా ఉందనీ, అరవయ్యేళ్ల కష్టార్జితం వదులుకుని కట్టుబట్టలతో వచ్చేసినప్పుడు కేంద్రం న్యాయం చేయకపోతుంటే బాధ ఉండదా అన్నారు. ‘దేశంలో మేం భాగం కాదా..? సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే… అణచివేసే ధోరణిలో కేంద్రం చూస్తోంది. లెక్కలేనితనంతో వ్యవహరిస్తోంది’ అంటూ చంద్రబాబు మాట్లాడారు.
తాము ఎన్డీయే నుంచి బయటకి వెళ్తే వైకాపాకి లాభం జరుగుతుందని ప్రధాని మాట్లాడారనీ, ప్రజా సమస్యలపై ప్రధానికి దృష్టి ఉండాలిగానీ ఇతర పార్టీల ప్రస్థావనా వారెవరో పోటీగా ఉన్నారని చెప్పడం ప్రధాని స్థాయికి తగిన వ్యాఖ్యలు కావన్నారు. అవినీతిమయమైన పార్టీని వెనకేసుకొస్తూ, రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయడం దురదృష్టకరమని చంద్రబాబు చెప్పారు. జనసేన, వైకాపాలు భాజపాకి వంతపాడుతూ ఆ పార్టీకి నష్టం జరక్కుండా కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. దేశమంతా పార్లమెంటులో ఆంధ్రా అంశంపై జరుగుతున్న చర్చవైపు చూస్తుంటే వైకాపా నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు? అవిశ్వాసం పెడితే దేశమంతా తిరిగి మద్దతు ప్రకటిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్, తెల్లారి దగ్గర నుంచీ టీడీపీని విమర్శించే విధంగా ట్వీట్లు పెడుతున్నారని అన్నారు.
ఈ పోరాటం ఇక్కడితో ఆగేది కాదనీ, న్యాయం జరిగేంత వరకూ కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. ‘మీ (మోడీ) మాట పాటించలేదని మీకు కోపంగా రావొచ్చు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారనే వ్యతిరేకించాను. ఏ లక్ష్యం కోసమైతే మీతో కలిశానో, అది ఏమాత్రం నెరవేకపోతుండటంతో ధర్మపోరాటం మొదలుపెట్టాను. అవిశ్వాసం తీసుకొచ్చాను’ అన్నారు.