యూటర్న్ తనది కాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీదేనని… ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీల కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే అవిశ్వాసం పెట్టామని.. మెజారిటీకి, మొరాలిటీకి మధ్య పోరాటం జరిగిందన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని
తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి ఇంకా ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారని అన్నింటిలోనూ యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజధానికి కేంద్రం రూ. 1500 కోట్లే ఇచ్చిందని.. ఆ డబ్బుతో కేబుల్ వర్క్ కూడా పూర్తి కాదన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే కేంద్రానికే లాభమని గుర్తు చేశారు. ఏపీకి నిధులు ఇచ్చేందుకే మీకు నిబంధనలు అడ్డువస్తున్నాయా? అన్ని నిలదీశారు.
విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని పలుమార్లు కోరినా స్పందన రాలేదన్నారు. 29సార్లు నేను స్వయంగా ఢిల్లీ వెళ్లానన్నారు. ఏపీ ప్రజలది కష్టపడే తత్వమన్న చంద్రబాబు కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లు పాస్ చేశారని…మోదీ అన్నారు…మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ను విమర్శిస్తూ… మీరు చేస్తున్నదేమిటని మండిపడ్డారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే ఎన్డీఏలో చేరాం తప్ప రాజకీయ అవసరాల కోసం కాదన్నారు.
కేసీఆర్ తో పోలుస్తూ… తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మోదీ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మోడీ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. అవినీతిని సహించబోమంటూనే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ ట్రాప్లో చంద్రబాబు పడ్డారన్న మోడీ వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ కోర్టులో ఉంటే మా ఎంపీలు పార్లమెంట్లో పోరాడారన్నారు. ఢిల్లీలో చంద్రబాబు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి..కృతజ్ఞతలు చెప్పడంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించే అవకాశం ఉంది.