ఇప్పుడంటే చిరంజీవి మెగా స్టార్. ఆయన ఇల్లు.. హీరోల ఫ్యాక్టరీ. చిరు సినిమా అంటే కళ్లు మూసుకుని వంద కోట్ల వ్యాపారం జరిగిపోతుంటుంది. వేల కోట్లకు అధిపతి. అయితే… ఒకప్పుడు ఆయన కూడా రూపాయి రూపాయికి తడుముకున్నవాడే. చాలా ఏళ్లు మధ్యతరగతి జీవితం గడిపిన వ్యక్తి. అలాంటి చిరు ఓసారి డబ్బులకు తెగ ఇబ్బంది పడిపోయాడట. ఎవరైనా అప్పుగా రూ.5 వేలు ఇస్తే బాగుణ్ణు అని తనకు తెలిసిన ప్రతీ ఒక్కరినీ అడిగాడట. కానీ ఎవ్వరూ ఇవ్వలేదట. ఆ సమయంలో ఎమ్మెస్ రాజు ఆదుకున్నాడట. ఎమ్మెస్ రాజు అప్పటికి చిరుతో సినిమాలేం చేయలేదు. అయినా సరే, చిరుపై నమ్మకంతో రూ.5 వేలు ఇచ్చారట. ఇదంతా చరణ్ పుట్టక ముందు జరిగిన కథ. ఈ విషయాన్ని ‘హ్యాపీ వెడ్డింగ్’ ప్రీ రిలీజ్ వేడుకలో గుర్తు చేసుకున్నాడు చరణ్. ఈ కార్యక్రమానికి నేను రావడం నా బాధ్యత.. దానికి కారణం ఇదీ… అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. ”చిత్ర సీమలో రాణించాలంటే ప్రతిభ మాత్రమే సరిపోదు. మంచితనం కూడా ఉండాలి. మంచి తనం ఉంటే.. ప్రతిభ లేకపోయినా ఏదో ఓ రోజు రాణిస్తారు. ఎమ్మెస్ రాజు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని చరణ్ విష్ చేశాడు.