శతమానం భవతితో ఓ సూపర్ హిట్ కొట్టాడు సతీష్ వేగ్నేశ. సాధారణంగా దిల్‌రాజు కాంపౌండ్‌లో ఓ దర్శకుడు ఓసారి అడుగుపెట్టాక, ఓ హిట్టు కొట్టాక.. అక్కడే స్థిరపడిపోవడం కామన్. అలానే సతీష్ కూడా అక్కడే ఉండిపోయాడు. ఈ బ్యానర్లో వరుసగా రెండో సినిమా తీశాడు. అదే.. శ్రీనివాస కల్యాణం. టైటిల్ చెప్పగానే ఇది కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనరే అని అర్థమైపోయి ఉంటుంది. అయితే టీజర్‌ని మాత్రం ఓ క్యూట్ లవ్ స్టోరీగా మలిచాడు సతీష్. నితిన్, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రమిది. ఆగస్టు మొదటి వారంలో విడుదల కాబోతోంది. ఈరోజు హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేస్తున్నారు. ముందుగా టీజర్ వచ్చేసింది. 38 సెకన్ల ఈ టీజర్‌ని చాలా క్యూట్‌గా కట్ చేశారు. ‘ఈవెనింగ్ మీ టైమ్ ఓ టూ అవర్స్అప్పుగా కావాలి’ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘ఏం.. అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా’ అనే… రాశీ డైలాగ్ తో టీజర్ ముగిసింది. మొత్తానికి ఈ ఫ్యామిలీ డ్రామాలో ఓ అందమైన ప్రేమకథని మిళితం చేశారన్న సంగతి అర్థమవుతోంది. టీజర్లో లొకేషన్స్, పిక్చరైజేషన్ రెండూ బాగున్నాయి. దిల్ రాజు బ్యానర్ వాల్యూకి తగ్గట్టుగా రిచ్ నెస్ కనిపిస్తోంది. ‘లై’, ‘చల్ మోహనరంగ’తో రెండు ఫ్లాపుల్ని చూసిన నితిన్‌కి ఈసారి మంచి ఫలితమే వచ్చేట్టు కనిపిస్తోంది. చూద్దాం.. ఏమవుతుందో..?